Share News

పొలం వివాదానికి ‘అక్షరం అండ’

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:20 AM

నగరాల్లోని సమస్యలే కాదు.. గ్రామాల్లోని భూవివాదాల పరిష్కారానికీ ‘అక్షరం అండగా’ నిలిచింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో...

పొలం వివాదానికి ‘అక్షరం అండ’

  • బాధితురాలికి అండగా కదిలిన రెవెన్యూ యంత్రాంగం

  • పెనుకొండలో నిర్వహించిన కార్యక్రమానికి స్పందన

పెనుకొండ రూరల్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): నగరాల్లోని సమస్యలే కాదు.. గ్రామాల్లోని భూవివాదాల పరిష్కారానికీ ‘అక్షరం అండగా’ నిలిచింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ఈ నెల 3న ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండ గా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో మంత్రి దృష్టికి వచ్చిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఆరోజు నిర్వహించిన ‘అక్షరం అండగా’ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సవిత, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ తదితర అధికారులు పాల్గొనగా.. మంగాపురం నుంచి వచ్చిన వెంకట లక్ష్మమ్మ అనే రైతు తన సమస్యను మంత్రికి వెళ్లబోసుకున్నారు. సర్వే నంబరు 984-9లో ప్రభుత్వం తమకు కొన్నేళ్ల కిందట 1.14 ఎకరాల భూమి ఇచ్చిందని, అందులో షెడ్డు కట్టుకుని జీవిస్తున్నామని తెలిపారు. అదే గ్రామానికి చెందిన చంద్ర... తమ పొలానికి వెళ్లే దారిని ఆక్రమించుకుని, తమను పొలానికి వెళ్లనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని బాధితురాలు మంత్రికి చెప్పుకొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో తహసీల్దార్‌ స్వాతి ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో సర్వే నిర్వహించారు. సర్వేయర్లు శ్రీనివాసులు, భరత్‌ క్షేత్రస్థాయికి వెళ్లి.. లక్ష్మమ్మ, చంద్ర పొలాలను సర్వే చేశారు. బాధితురాలి పొలంలో 20 నుంచి 30 సెంట్లు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని తహసీల్దారు చెప్పారు. రహదారిని ఆక్రమించిన చంద్రకు తహసీల్దారు ఫోన్‌ చేయగా... తాను ఇప్పుడు రాలేనని చెప్పడంతో.. నోటీసులు ఇస్తామని తహసీల్దారు చెప్పారు. రెండు రోజుల్లో నోటీసులు పంపి, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 04:20 AM