Share News

రామాలయ నిర్మాణానికి మునిసిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:04 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణానికి కుల మతాలకు అతీతంగా మద్దతు పలుకుతూ మంగళవారం మునిసిపాలిటీ తీర్మానం చేసిందని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు తెలిపారు.

రామాలయ నిర్మాణానికి మునిసిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం

  • శంకుస్థాపన తేదీని మే మొదటి వారంలో నిర్ణయిస్తాం

  • ఆ నలుగురు నీలి కుమారుల మాటలు వినొద్దు

  • నరసాపురం పాస్టర్‌ ఇంట్లో దొరికిన నగదు వెనుక కుట్రకోణం: రఘురామరాజు

కాళ్ల/ఆకివీడు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణానికి కుల మతాలకు అతీతంగా మద్దతు పలుకుతూ మంగళవారం మునిసిపాలిటీ తీర్మానం చేసిందని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు తెలిపారు. కాళ్ల మండలం పెద అమిరం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వ అనుమతులతోనే ఆలయాల నిర్మాణాలు ఉండాలన్న విశ్రాంత న్యాయాధికారి శ్రవణ్‌కుమార్‌ వాదనతో నేను ఏకీభవిస్తున్నా. పెదపేట రామాలయ నిర్మాణానికి మద్దతుగా ఆకివీడు మునిసిపాలిటీలో ఒక్క కౌన్సిలర్‌ మినహా మిగిలిన సభ్యులందరూ ఓటు వేశారు. ఇది నీలి కుమారుల కాటుకు చెప్పు దెబ్బ. రామాలయ నిర్మాణానికి కోర్టు అడ్డు చెప్పిందని నీలి కుమారులు సోషల్‌ మీడియాలో చెబుతున్నవన్నీ అబద్ధాలే. అన్ని అనుమతులతోనే రామాలయం నిర్మాణం జరుగుతుంది. శంకుస్థాపన ఎప్పుడు చేస్తామనేది మే మొదటి వారంలో నిర్ణయిస్తాం. ఇటీవల నరసాపురానికి చెందిన పాస్టర్‌ వద్ద రూ.రెండు కోట్ల నగదు దొరికింది. దీని వెనుక కుట్ర ఉంది. సస్పెండ్‌ అయిన ఐపీఎస్‌ పోలీస్‌ అధికారి హస్తం ఉండవచ్చు. ఆ పాస్టర్‌ వెనుక ఉన్న వారందరూ ఆకివీడు ఘర్షణలో ముఖ్యపాత్ర పోషించిన వారే. వారికీ, సస్పెండ్‌ అయిన పోలీసు అధికారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ ఘటనలో నేర కోణం దాగి ఉంది. ఆ దిశగా పోలీసులు విచారణ చేయాలి. నాకు శాసనసభ్యులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా విచారణ చేయిస్తా’ అని రఘురామ చెప్పారు.

Updated Date - Apr 22 , 2026 | 05:05 AM