Share News

రేపు రామాలయ శంకుస్థాపన

ABN , Publish Date - May 02 , 2026 | 03:58 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణానికి ఈ నెల మూడో తేదీ ఉదయం 7.14 గంటలకు శంకుస్థాపన ముహూర్తం ఖరారైందని ...

రేపు రామాలయ శంకుస్థాపన

  • కులమతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం

  • డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు

కాళ్ల/ఆకివీడు, మే 1(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణానికి ఈ నెల మూడో తేదీ ఉదయం 7.14 గంటలకు శంకుస్థాపన ముహూర్తం ఖరారైందని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు తెలిపారు. కాళ్ల మండలం పెద అమిరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇప్పటికే ఆలయ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయి. దీనికి క్లియరెన్స్‌ ఇచ్చిన కలెక్టరేట్‌, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు. అనుమతి లేకుండా కడుతున్నారంటూ జడ శ్రవణ్‌కుమార్‌ పిటిషన్‌ వేశారు. శ్రీరాముడు లాయర్‌ రూపంలో శ్రవణ్‌కుమార్‌ను ఎదుర్కొని శంకుస్థాపనకు అడ్డు లేకుండా చేశారు. శంకుస్థాపనకు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాం. మాకు దళితులతో, క్రైస్తవులతో ఎటువంటి ఇబ్బందీ లేదు. అన్యమతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. కాబట్టి దళితులు, క్రైస్తవులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మతం మారిన వారికి కేసులు పెట్టే అర్హత లేదని రాష్ట్రం మొత్తం తెలిసింది. ఓటు రాజకీయాలు కరెక్టు కాదు. గరగపర్రు రోజులు పోయి.. ఆకివీడు రోజులు వచ్చాయని తెలుసుకోవాలి. మా గుడిని మీరు గౌరవించండి.. మీ చర్చిని మేం గౌరవిస్తాం’ అని వివరించారు.

నిర్మాణ పనులకు ఏర్పాట్లు

ఆకివీడు పెదపేట రామాలయం నిర్మాణ పనులకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. భీమవరం, విజయవాడ నుంచి కమిటీ నాయకులు, ఇంజనీర్లు వచ్చి నిర్మాణానికి అవసరమైన కొలతలు వేశారు. కళావాస్తు, ఆగమ శాస్త్ర ప్రకారం ప్రముఖ స్థపతి డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి గణితం కట్టి ఎలా నిర్మిస్తే అనువుగా ఉంటుందో తెలియచేయనున్నారు. ఎస్‌ఐ హనుమంతు నాగరాజు నేతృత్వంలో శనివారం రాత్రి నుంచి 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - May 02 , 2026 | 03:58 AM