అన్నిట్లో ఆయనే!
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:14 AM
అజేయ కల్లంరెడ్డి.. రిటైర్డ్ ఐఏఎస్ అఽధికారి. నాటి వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నమ్మినబంటు. ఆయనకు ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆయన పేరే.
కీలక కేసుల రిపోర్టుల్లో అజేయ కల్లంరెడ్డి ప్రస్తావన
ఢిల్లీ ఏపీ భవన్‌లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా
చిన్నప్పన్న పోస్టింగ్‌కు నాడు సిఫారసు లేఖ జారీ
తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుడు అప్పన్న
బేవరేజెస్ కార్పొరేషన్‌లో ఎండీగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లకు పోస్టింగ్‌లకూ లేఖలు
3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో ఏ2, ఏ3లు వారే
నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ హోదాలో అజేయ కల్లం సిఫారసు లేఖలు
చిన్నప్పన్న, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్.. వీరి గురించి మన రాష్ట్రంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ముగ్గురి పేర్లూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.
టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు. గత ప్రభుత్వంలో ఏపీ భవన్‌లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా ఉంటూ తిరుమల వ్యవహారాల్లో చక్రం తిప్పాడు.
నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్‌లు రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో ఏ2, ఏ3 నిందితులు.
ఏపీ భవన్‌లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా చిన్నప్పన్నను, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని, కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా సత్యప్రసాద్‌ను నియమించాలని సిఫారసు లేఖలు రాసింది ఒక్కరే. ఆయనే.. నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ అజేయ కల్లంరెడ్డి. సీబీఐ, సిట్ దర్యాప్తులో ఈ విషయం బయటపడింది.
వివేకా హత్య కేసులో అజేయ కల్లం నుంచి సీబీఐ విట్‌నెస్ స్టేట్‌మెంట్ తీసుకుంది. ఇదే తరహాలో తిరుమల కల్తీ నెయ్యి కేసు, లిక్కర్ కేసులోనూ అజేయ కల్లం స్టేట్‌మెంట్ తీసుకుంటారా?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అజేయ కల్లంరెడ్డి.. రిటైర్డ్ ఐఏఎస్ అఽధికారి. నాటి వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నమ్మినబంటు. ఆయనకు ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆయన పేరే. ఏ కేసు గురించి విన్నా అందులో ఆయన ప్రస్తావనే. ఏ రిమాండ్ రిపోర్టు చూసినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన నామస్మరణే. ఆయన లేఖలు, సిఫారసుల కలకలమే. 2019-2024లో నాటి ముఖ్యమంత్రి మనోభీష్టాలను నెరవేర్చే క్రమంలో ఆయన లేఖలు దశదిశలా వ్యాపించాయి. చివరికి రాష్ట్రాన్ని కుదిపేసిన ఆర్థిక నేరాలు, కుంభకోణాలు, ఇతర మహాపచారాల్లోనూ ఆయన లేఖలు కలకలం రేపాయి. అందుకే ఇప్పుడు అన్ని చోట్లా ఆయన పేరే వినిపిస్తోంది. నాటి వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్ హోదాలో అజేయ కల్లంరెడ్డి చేసిన పనులు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కుంభకోణాలు, కేసుల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మొన్నటికి మొన్న.. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు, నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పీఏగా పనిచేసిన చిన్నప్పన్నను ఏపీ భవన్‌లో అధికారిగా నియమించిన వ్యవహారంలో అజేయ కల్లంరెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది. అలాగే రాష్ట్రాన్ని కుదిపేస్తున్న 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణంలో కేంద్ర సర్వీసు రైల్వే ట్రాఫిక్‌లో ఉన్న వాసుదేవ రెడ్డిని, ఎక్సైజ్‌లో ఉన్న సత్యప్రసాద్‌ను బేవరేజెస్ కార్పొరేషన్‌లో నియమించడం వెనక ఆయన లేఖాస్త్రాలే పనిచేశాయని వెలుగులోకి వచ్చింది. నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు చేయలేని పనులు ప్రిన్సిపల్ అడ్వైజర్ హోదాలో అజేయ కల్లంరెడ్డి చేశారని ఇప్పుడు తేట తెల్లమవుతోంది. నాటి ముఖ్యమంత్రి జగన్ అభీష్టాన్ని నెరవేర్చడంలో ముందున్న ఆయన.. కీలక కేసుల్లో ఆయన లేఖల ప్రస్తావన వెలుగులోకి వచ్చినా ఇప్పటి వరకు విచారణ ఎదుర్కోకపోవడం గమనార్హం.
జగన్ పంచన చేరారు.. ఇక అంతే
కానీ విచిత్రం ఏమో.. రిటైర్ అయిన తర్వాత అజేయ కల్లంరెడ్డి ఒక్కసారిగా నాటి టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకిగా మారారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్‌కు దగ్గరయ్యారు. 2019 ఎన్నికలకు వైసీపీ సన్నద్ధమయ్యే దశలో ఆ పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పన కమిటీలో చోటు దక్కించుకున్నారు. 2019 మార్చి 15న జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ కేసును విచారించిన సీబీఐ అజేయ కల్లంరెడ్డి నుంచి విట్‌నెస్ స్టేట్‌మెంట్ తీసుకుంది. వివేకా హత్య కేసులో ఆయన ప్రస్తావన రావడానికి ఓ నేపథ్యం ఉంది. 2019 మార్చి 15న తెల్లవారుజామున జగన్ ఇంట్లో మ్యానిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే వివేకా హత్య సమాచారం జగన్‌కు చేరింది. సరిగ్గా ఆ సమయంలో జగన్‌తో అజేయ కల్లంరెడ్డి మీటింగ్‌లో ఉన్నారు. వివేకా హత్య గురించి జగన్‌కు ఎప్పుడు? ఎలా? తెలిసిందన్న కోణంలో ఆరా తీసిన సీబీఐ.. నాడు జగన్ వెంటే ఉన్న అజేయ కల్లం దగ్గర స్టేట్‌మెంట్ తీసుకుంది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆ తర్వాత సీబీఐ చార్జిషీట్ వేసినప్పుడు బయటకొచ్చింది. ఇప్పుడు ఇతర కీలక కేసుల్లో ఆయన ప్రస్తావన గురించి వెలుగులోకి వస్తోంది.
ఆ ఇద్దరినీ తీసుకురావడంలోనూ..
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం కేసులోనూ ఇప్పుడు అజేయ కల్లం సిఫారసుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో రైల్వే ట్రాఫిక్ సర్వీసులో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించాలని నాటి ప్రభుత్వం భావించింది. అలాగే ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న సత్యప్రసాద్‌ను బేవరేజెస్ కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారిగా నియమించడం వెనక జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ అజేయ కల్లం లేఖలు బయటకొచ్చాయి. సీఎం అభీష్టం మేరకే ఆ ఇద్దరినీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో నియమించాలని నాటి సీఎ్‌సకు ప్రధాన సలహాదారుగా ఆయన లేఖలు రాశారు. రూ.3,500 కోట్ల లిక్కర్ కుంభకోణంలో కుట్రదారు, పాత్రధారులైన ఏ2, ఏ3లను బేవరేజెస్ కార్పొరేషన్‌కు తీసుకురావాలనుకుంది నాటి ప్రభుత్వ పెద్దలే అయినా, వారి నియామకం వెనక పనిచేసిన లేఖలు అజేయ కల్లంవే అని సిట్ దర్యాప్తులో వెలుగుచూసింది. లిక్కర్ కుంభకోణంలో ఇంకా వెలుగుచూడని సూత్రధారులలను కనిపెట్టేందుకే ఈ కేసులో ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అరెస్ట్ చేసి, ఆయన్ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించింది.
మచ్చలేని అధికారిగా పేరు
అజేయ కల్లంరెడ్డి 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2017 మార్చి 1నుంచి 31 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరయ్యారు. ఉమ్మడి ఏపీలో ఆయన నల్లగొండ, ఖమ్మం, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల కలెక్టర్‌గా సేవలందించారు. దేవదాయ శాఖ కమిషనర్‌గాను సేవలందించారు. విశాఖ పోర్టు ట్రస్ట్ చైౖర్మన్‌గా, ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యనిర్వాహణాధికారి(ఈవో)గా పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంవో ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. రిటైర్డ్ అయ్యేవరకు అంటే.. 2017 మార్చి వరకు అజేయ కల్లంరెడ్డి సర్వీసులో ఒక్క విమర్శా లేదు. ఆయన పనితీరును వేలెత్తి చూపినవారు లేరు. టీటీడీ ఈవోగా ఆయన సేవలు, తీసుకున్న నిర్ణయాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
అప్పన్న నియామకం వెనుక..
జగన్ ప్రభుత్వం వచ్చీ రాగానే.. 2019 మేలో అధికారంలోకి రాగా జూన్ 4న అజేయ కల్లంను ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమించారు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన ఐదు రోజులకే ఈ నియామకం జరిగింది. ఇక అప్పటి నుంచి 2024 జూన్ 11 వరకు ఆయన సీఎంకు ప్రధాన సలహాదారుగానే పనిచేశారు. నిజానికి అందరి ముఖ్యమంత్రుల్లాగానే జగన్‌కు కూడా సీఎంవో ఉండేది. అందులో ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి స్థాయి అధికారులు ఉన్నారు. వారంతా ఐఏఎ్‌సలే. కానీ జగన్ మనసెరిగిన మనిషిగా.. ఆయన అభీష్టాలు చాలా వరకు అజేయ కల్లం ద్వారానే బయటకొచ్చాయని ఇప్పుడు పలు కేసుల్లో వెల్లడైన ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఇందులో మొదటిది చిన్నప్పన్న నియామకం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో అజేయ కల్లం పేరు ఉంది. వైవీ సుబ్బారెడ్డికి పీఏగా పనిచేసిన చిన్నప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్‌లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా నియమించాలనుకున్నారు. వైవీ సుబ్బారెడ్డినే ఇందుకు సిఫారసు చేయవచ్చు. కానీ ఆ పనిని నాటి సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లంరెడ్డితో చేయించారు. చిన్నప్పన్నను ఏపీ భవన్‌లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా నియమించాలంటూ అజేయ కల్లం నాటి చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఆ తర్వాతే ఆయన్ను అక్కడ నియమించారు. ఆ తర్వాత ఇదే చిన్నప్పన్న ఢిల్లీలోని ఏపీ భవన్‌ను అడ్డాగా మార్చుకొని టీటీడీ వ్యవహారాల్లో రాచకార్యాలు నెరవేర్చారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను బెదిరించడం, ఢిల్లీలోని ఎంపీల నివాసాలకు పిలిపించి బేరాలాడటం వంటి ఘనకార్యాలు చేశారు. సీబీఐ సిట్ దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. అజేయ కల్లం సిఫారసుతోనే చిన్నప్పన్న ఏపీ భవన్‌కు వచ్చారని సిట్ తేటతెల్లం చేసింది. చిన్నప్పన్నను ఏపీ భవన్‌లో నియమించాలని అజేయ కల్లంను కోరిందెవరు? ఆయనకు లేఖ రాయమని చెప్పిందెవరు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.