ఏఐటీయూసీ నూతన కార్యవర్గం ఎన్నిక
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:46 AM
తిరుపతి లో ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ మహాసభల్లో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
191 మంది సభ్యులతో రాష్ట్ర సమితి, 43 తీర్మానాలకు అమోదం
తిరుపతి(కల్చరల్), ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): తిరుపతి లో ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ మహాసభల్లో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 191 మందితో రాష్ట్ర సమితిని నియమించారు. వీరిలో 23 మంది ఆఫీస్ బేరర్లను కూడా ఎంపిక చేశారు. రాబోయే మూడు సంవత్సరాల కాలానికి కార్యాచరణను నిర్దేశిస్తూ 43 తీర్మానాలను అమోదించారు. కార్మికులకు కనీస వేతనాన్ని రూ.35 వేలకు పెంచాలని, కొత్త లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్దీకరించాలని, ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు. అలాగే విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పోరాటాన్ని బలోపేతం చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ చట్టం అమలు చేయాలని, ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, మేడే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించి కార్మిక వర్గాన్ని పోరాటాలకు సన్నద్ధం చేయాలని మహాసభ పిలుపునిచ్చింది.