Share News

డిజిటల్‌ ఎకానమీ గమ్యస్థానంగా ఏపీ

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:45 AM

భవిష్యత్‌ డిజిటల్‌ ఎకానమీకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవనున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నంలో ఎయిర్‌ట్రంక్‌ సంస్థ 2 గిగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ను...

డిజిటల్‌ ఎకానమీ గమ్యస్థానంగా ఏపీ

అమరావతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌ డిజిటల్‌ ఎకానమీకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవనున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నంలో ఎయిర్‌ట్రంక్‌ సంస్థ 2 గిగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని చూపడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును ఎయిర్‌ట్రంక్‌ ఫౌండర్‌, సీఈవో రాబిన్‌ ఖుదా మంగళవారం కలిశారు. ఆ వివరాలను సీఎం చంద్రబాబు ఎక్స్‌ వేదికగా వివరించారు. స్వచ్ఛ ఇంధనం, ప్రపంచస్థాయి కనెక్టివిటీ, నైపుణ్యం, సుస్థిర మౌలిక సదుపాయాలు, ప్రపంచంతో పోటీపడే డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్‌ దార్శనికతపై తాము చర్చించామని చెప్పారు. విశాఖపట్నంలో ఎయిర్‌ట్రంక్‌ 2 గిగావాట్ల హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ క్యాంప్‌సను ఏర్పాటు చేయడంపైనా తాము చర్చించామన్నారు. తమ లక్ష్యం పెట్టుబడులను ఆకర్షించడమే కాదని.. రాష్ట్ర యువతకు అవకాశాలను కల్పించడమని తెలిపారు. యువతలో డిజిటల్‌ సామర్థ్యాలు పెంచే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. సమ్మిళిత, పర్యావరణ అనుకూల అభివృద్ధి తమ బాధ్యత అని పేర్కొన్నారు. డిజిటల్‌ ఇన్ర్ఫాలో సహకారానికి గల అవకాశాలను చర్చించామని చెప్పారు. రాష్ట్రాన్ని ఫ్యూచర్‌ రెడీ ఎకానమీగా తీర్చిదిద్దడానికి, అలాగే నైపుణ్య అభివృద్ధిలో ఉన్న అవకాశాలను పరిశీలించామన్నారు. ఆసియా-పసిఫిక్‌లోనే ప్రఖ్యాతిగాంచిన హైపర్‌స్కేల్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కలిగిన సంస్థగా ఎయిర్‌ ట్రంక్‌ ప్రఖ్యాతిగాంచింది. ముంబైలో సోమవారం రాబిన్‌ ఖుదాతో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశమైన 24 గంటల్లోగానే రాష్ట్రంలో రెండు గిగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఖుదా-చంద్రబాబు మధ్య సుదీర్ఘంగా చర్చ జరగడం గమనార్హం.

Updated Date - Jun 03 , 2026 | 04:45 AM