Bhogapuram Airport: ఎగిరొచ్చిన ఎయిర్‌బస్
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:37 AM
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ ఫలించింది. ఎయిరిండియా ‘ఎయిర్‌బస్’ ఎగిరొచ్చి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలింది.
భోగాపురం ఎయిర్‌పోర్టులో క్షేమంగా దిగిన విమానం
తొలి ఫ్లైట్ ల్యాండింగ్‌తో పులకించిన ఉత్తరాంధ్ర
ఢిల్లీలో బయల్దేరి ఉదయం 11 గంటలకు ల్యాండింగ్
ఉద్విగ్న క్షణాల మధ్య ట్రయల్ రన్ విజయవంతం
కేంద్ర మంత్రి రామ్మోహన్, ఇతర ప్రతినిధుల రాక
ఘన స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు
బుర్రలేని వారే భోగాపురంలో విమానాశ్రయం కడతారన్న వైసీపీ అధినేత ఇప్పుడు ఏమంటారో సమాధానం చెప్పాలి. ఎయిర్‌పోర్టు పనులను జగన్ అండ్ కో నీరుగార్చారు. ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రతో పాటు విశాఖ నగరం రూపురేఖలే మారిపోతాయి.
-కేంద్ర మంత్రి రామ్మోహన్
విజయనగరం, అమరావతి, న్యూఢిల్లీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ ఫలించింది. ఎయిరిండియా ‘ఎయిర్‌బస్’ ఎగిరొచ్చి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలింది. ట్రయల్ రన్‌లో భాగంగా.. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను మోసుకుంటూ ‘ఎయిరిండియా ఎయిర్‌బస్ ఏ320’ విమానం తొలిసారిగా ఆదివారం ఉదయం భోగాపురం ఎయిర్‌పోర్టులో క్షేమంగా ల్యాండ్ అయింది. ఈ చరిత్రాత్మక ఘట్టంతో ఉత్తరాంధ్ర నేల పులకించింది..! ఢిల్లీ నుంచి 1,600 కిలోమీటర్లు ప్రయాణించిన ఎయిరిండియా విమానం గంటన్నర వ్యవధిలో భోగాపురం చేరుకుంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విమానయాన శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. ట్రయల్ రన్‌పై పెద్దఎత్తున ప్రచారం జరగడంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తుండగా.. ఈ ఫ్లైట్ భోగాపురం ఎయిర్‌పోర్టులో విజయవంతంగా ల్యాండ్ అయింది. జలఫిరంగులతో దీనికి ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకకు విశాఖ ఎంపీ శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం కళ్యాణి మాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు.. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తదితరులు హాజరయ్యారు.
వెల్‌కమ్ టు భోగాపురం ఎయిర్‌పోర్ట్
ఆదివారం ఢిల్లీలో బయల్దేరిన ఎయిరిండియా విమానం ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాగతం’ అనే అనౌన్స్‌మెంట్ వినిపించగానే.. ఆ క్షణంలో విమానంలో ఉన్న కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఇతర ప్రతినిధులతోపాటు అప్పటికే అక్కడకు చేరుకున్న ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికారులు, దూరం నుంచి వీక్షిస్తున్న ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. తొలుతశాఖ రామ్మోహన్‌నాయుడు అభివాదం చేస్తూ విమానం దిగారు. తర్వాత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఆపై పౌరవిమానయాన శాఖ ఉన్నతాధికారులు ఒక్కొక్కరూ దిగారు. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు వారికి స్వాగతం పలికారు. కాగా... ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది జూన్ 26న ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం ఉంటుందని నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రకటించడం విశేషం. కాగా విభజన హామీల్లో భాగంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఎయిర్‌పోర్టు నిర్మాణం.. మధ్యలో ప్రభుత్వం మారడం వల్లే జాప్యం జరిగిందని రామ్మోహన్‌నాయుడు మీడియాతో అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిగా అశోక్‌గజపతిరాజు ప్రారంభించిన ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తయిన సమయంలో తాను అదే శాఖ మంత్రిగా ఉండడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు.
వైసీపీ హయాంలో త్వరితగతిన పనులు చేపట్టిఉంటే ఈపాటికే ఇక్కడ విమానం ఎగిరేదన్నారు. ఎయిర్‌పోర్టు పనులను జగన్ అండ్ కో నీరుగార్చారని విమర్శించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం ప్రధాని మోదీ దార్శనికతకు, సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి మచ్చుతునకగా అభివర్ణించారు. ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రతో పాటు విశాఖ నగరం రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. అమరావతిలో ఎయిర్‌పోర్టు కోసం కూడా భూమిని చూస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాగానే అక్కడ కూడా ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపడతామని తెలిపారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో జగన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారన్నారు. గతంలో బుర్రలేనోళ్లు భోగాపురం ఎయిర్‌పోర్టు కడతారని కామెంట్ చేసిన ఆయన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమండ్ చేశారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని అశోక్ గజపతిరాజు ఎల్లప్పుడూ కోరుకుంటారని, అందుకే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అకాడమీ కోసం రూ.వెయ్యి కోట్ల విలువైన 136 ఎకరాలను మాన్సాస్ ట్రస్ట్ నుంచి ఉచితంగా ఇచ్చారని గుర్తుచేశారు.
జగన్ మొసలి కన్నీరు: ఎంపీ కలిశెట్టి
భోగాపురం విమానాశ్రయంపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఈ విమానాశ్రయానికి ఒక్క ఇటుకైనా పేర్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో పనులు పరుగులు పెడుతుంటే, క్రెడిట్ కోసం జగన్ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ట్రయల్ రన్ విజయంపై సీఎం హర్షం
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ట్రయల్‌రన్‌లో భాగంగా తొలి విమానం విజయవంతంగా ల్యాండింగ్ కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 2014-19 మధ్యకాలంలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ఈ విమానాశ్రయ నిర్మాణం ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన 4 శాతం పనులను కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ 18 నెలల్లో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
భోగాపురాన్ని అడ్డుకుంది జగనే: లోకేశ్
ఏపీ చరిత్రలో ఈ రోజు (ఆదివారం) ఓ మైలురాయి అని మంత్రి లోకేశ్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతో దోహదపడనుందని చెప్పారు. ఈ విమానాశ్రయాన్ని అడ్డుకున్న ఘనత ముమ్మాటికీ జగన్‌దేనని అన్నారు. 2014-19లో విమానాశ్రయాన్ని అడ్డుకునేందుకు ఎర్ర బస్సు కూడా రాని ఈ ఊరికి ఎయిర్‌పోర్టు ఎందుకని ప్రశ్నించిన జగన్‌కు.. ఇప్పుడు భోగాపురం ఘనత తనదేనని చెప్పుకోవడానికి సిగ్గుండాలని లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.