నెరవేరిన ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల బోధనేతర సిబ్బంది కల
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:15 AM
రాష్ట్రంలో ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల బోధనేతర సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో వారికి ఊరట లభించిందని, ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం జీఓఎంఎస్ నెం.34ను విడుదల చేయడంతో..
ప్రభుత్వానికి సంఘం కృతజ్ఞతలు
విజయవాడ, జూన్ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల బోధనేతర సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో వారికి ఊరట లభించిందని, ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం జీఓఎంఎస్ నెం.34ను విడుదల చేయడంతో వారి చిరకాల వాంఛ నెరవేరిందని బోధనేతర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నాళం ఉమామహేశ్వరి అన్నారు. ఈ జీవోతో విలీన ఉద్యోగులకు సేవా నిబంధనలపై స్పష్టత, భద్రతతో పాటు భవిష్యత్తుకు అవసరమైన న్యాయపరమైన రక్షణ లభించిందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపిందని, ఇది విలీనమైన ఉద్యోగులందరికీ చారిత్రక మేలని ఆమె అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సమస్యలను పరిశీలించి ప్రత్యేక సర్వీస్ రూల్స్ విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేసిన ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన సమస్యలనూ ప్రభుత్వం ఇదే విధంగా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.