ఏఐసీ.. ఆవిష్కరణల వేదిక..!
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:06 AM
ఇంజనీరింగ్ చేయాలి.. మంచి ఉద్యోగం సాధించాలి.. తమ కాళ్లపై తాము నిలబడాలి.. ఒకప్పుడు యువత ఆలోచన ఇది..! ఇప్పుడు కాలం మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న నేటి కాలంలో యువత ఆలోచనా విధానం కూడా మారిపోయింది..! సరికొత్త ఆలోచనలతో తామే సొంతగా స్టార్ట్‌పలు స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎస్కేయూలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్
వినూత్న ఆలోచనలకు సంపూర్ణ సహకారం
వస్తువుల అభివృద్ధి, మార్కెటింగ్‌కు తోడ్పాటు
స్టార్ట్‌పలతో ఉద్యోగాలు... వ్యాపార అవకాశాలు
(అనంతపురం ఉన్నత విద్య - ఆంధ్రజ్యోతి)
ఇంజనీరింగ్ చేయాలి.. మంచి ఉద్యోగం సాధించాలి.. తమ కాళ్లపై తాము నిలబడాలి.. ఒకప్పుడు యువత ఆలోచన ఇది..! ఇప్పుడు కాలం మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న నేటి కాలంలో యువత ఆలోచనా విధానం కూడా మారిపోయింది..! సరికొత్త ఆలోచనలతో తామే సొంతగా స్టార్ట్‌పలు స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వినూత్న ఆలోచనలకు రూ పం తొడుగుతూ.. వారికి అండగా నిలుస్తూ సరికొత్త ఆవిష్కరణల వేదికగా నిలుస్తోంది అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ)లోని అట ల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ). వినూత్న ఆలోచనలతో వచ్చేవారికి మద్దతిస్తూ సరికొత్త ఉత్పత్తుల తయారీకి ఊతమిస్తూ.. వాటిని మార్కెటింగ్ చేసే వరకూ సహకారం అందిస్తోంది. ఇలా ఎందరినో వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దింది. ఇక్కడ ప్రయోగాలు చేసిన విద్యార్థులు.. ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు పొందేస్థాయికి ఎదిగారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్కేయూలో 2018లో ఏఐసీ ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సహకారం తోడైంది. అక్కడి అత్యాధునిక వసతులు, పరికరాలతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నారు. నూతన ఆలోచనతో వస్తే.. పరిశీలించి, స్టార్ట్‌పగా ఎలా మార్చాలి, మార్కెట్లోకి ఎలా ప్రవేశపెట్టాలని, అయ్యే ఖర్చు ఎంత.. తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నారు. ఆరు నెలలపాటు సాగే ఈ శిక్షణలో విద్యార్థుల సృజనకు పదును పెడుతున్నారు.
పరిశోధనలకు ఫండింగ్
విద్యార్థులు పరిశోధనల సమయంలో ఫండింగ్ సమస్య రాకుండా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ దన్నుగా నిలుస్తోంది. ప్రొడక్ట్ విలువను బట్టి కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ నిధులు సమకూరుస్తోంది. ఈ సొమ్ముతో తయారు చేసిన వస్తువులను పరిశీలించి, మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు శిక్షణ ఇస్తోంది. ప్రొడక్ట్ భారీస్థాయిలో ఉంటే రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకూ నిధులను సమకూరుస్తోంది. ఇప్పటి వరకూ 65 మందికిపైగా స్టార్ట్‌పలతో జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేస్తున్నారు.
అనంత రైతుల కష్టాలను చూసి..
పండ్లతోటలకు అనంతపురం జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ చీనీ అధికంగా సాగు చేస్తున్నట్లు ఉషన్ శివరామ్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. వాటిపై మూడేళ్లపాటు పరిశోధన చేశారు. చీనీ రైతుల సాగు, దిగుబడి, ఎగుమతి, రవాణా తదితరాలపై అధ్యయనం చేశారు. సరైన సమయంలో ఎగుమతి చేయలేకపోయిన రైతులు నష్టపోవడాన్ని గుర్తించారు. రైతులకు మేలు చేయాలన్న ఆలోచనతో ఎస్కేయూ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌కు వచ్చారు. ఆయన ఆలోచనను పరిశీలించిన సెంటర్ సీఈవో తదితరులు దానికి కార్యరూపం చేకూర్చారు. బత్తాయి టీ పొడి, కోల్డ్ టీ, ఫేస్ మాస్క్ పౌడర్, స్లైస్ చాక్లెట్స్ వంటివి తయారు చేస్తే... మిగిలిపోయిన చీనీని ఈ తరహా కంపెనీలకు తరలించవచ్చనే ఆలోచన చేశారు. వెంటనే సహస్తి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు.
ఊరి ప్రజల కోసం తపన
తాను పెరిగిన ఊరి కోసం... తన విజ్ఞానాన్ని ఉపయోగించాలనుకున్నాడు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ప్రమోద్‌కుమార్. ఎస్కేయూ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌కు చేరుకున్నాడు. సముద్రపు నీటిని ఉపయోగించుకోవడానికి ఓ మార్గం అన్వేషించాలనుకున్నాడు. ఉప్పునీటిని మంచినీరుగా మార్చే యంత్రాన్ని ఆవిష్కరించాలనుకున్నాడు. ఇందుకు సెంటర్ నిర్వాహకులు తోడుగా నిలిచి విద్యార్థిని ప్రోత్సహిస్తున్నారు. నాలుగు నెలలుగా ఆ విద్యార్థి ఏఐసీలోనే థర్మల్ హీటింగ్ కాన్సెప్ట్‌తో ప్రొడక్ట్‌ను తయారు చేస్తున్నాడు. పారిశ్రామిక అవసరాల కోసం సోలార్ హీటర్‌ను రూపొందిస్తున్నాడు. తద్వారా తక్కువ ఖర్చుతో వేడిచేయవచ్చు. ఈ ఇన్నోవేషన్‌పై కొన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రొడక్ట్ త్వరలోనే పూర్తి కానుంది.
ఇక్కడికొచ్చిన ఏ విద్యార్థీ విఫలం కాలేదు
నూతన ఆలోచనలతో ఇక్కడికొచ్చిన విద్యార్థులెవరూ విఫలం కాలేదు. శిక్షణ సమయంలో నిరాశతో వెనుదిరగాలన్న విద్యార్థులను ప్రోత్సహించి వారిని విజయతీరాలకు తీసుకెళ్లాం. ఏఐసీలో ఉన్న వసతులు, వర్క్‌షాప్, స్టార్ట్‌పలు ఎలా స్థిరంగా ఉండాలి తదితర అంశాలపై విద్యార్థులకు ఆరునెలలు శిక్షణ ఇస్తున్నాం. ఆ సమయంలోనే విద్యార్థుల నైపుణ్యం బయటపడటంతోపాటు వారి ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి. ఈ ఏఐసీ ద్వారా ఇప్పటివరకూ 65కిపైగా స్టార్ట్‌పలు తయారు చేశాం. అనంతపురం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఇక్కడికొచ్చి స్టార్ట్‌పలతో తిరిగి వెళ్తుండటం గర్వకారణం.
- చంద్రమౌళి, సీఈవో, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఎస్కేయూ
వినూత్న ఆలోచనలకు మద్దతిస్తాం..
ఉద్యోగాలవైపే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్లే వారికి కూడా ఎస్కేయూ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మద్దతిస్తోంది. అమరావతి క్వాంటం హ్యాకథాన్‌లో మొదటిస్థాయిలో నిలిచిన ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఏఐసీలో శిక్షణ పొందినవారే. ప్రస్తుతం ఎంబీఏ, ఎంసీఏ, కెమిస్ర్టీ, ఫార్మసీ విభాగాల విద్యార్థులతో ఆవిష్కరణలు చేయించేలా చర్యలు చేపడుతున్నాం. ఇన్నోవేటివ్ ఐడియాలకు మద్దతుగా నిలిచి, స్టార్టప్ రూపొందించే వరకూ ఈ సెంటర్ వారు బాధ్యత తీసుకుంటారు. - అనిత, ఎస్కేయూ వీసీ
ప్రధాని మెప్పుపొందిన హెలెన్ బైక్
విజయవాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు 2021లో హెలెన్ బైక్ (ఎలక్ర్టిక్ సైకిల్)ను ఆవిష్కరించారు. వారి ఆలోచనకు ఏఐసీ సహకారం తోడైంది. ఆరు నెలల్లో సాధారణ సైకిల్ కంటే... తక్కువ కష్టంతో అధిక స్పీడుతో వెళ్లే హెలెన్ బైక్ సృష్టించారు. పెడల్ తొక్కే పని లేకుండా... చైన్ అవసరం లేకుండా విద్యుత్‌తో నడిచేలా దీన్ని రూపొందించారు. ఈ ఆవిష్కరణ బలపడి స్టార్టప్‌గా మారడంతో ఢిల్లీలోని ఓ వర్క్‌షాపులో బైక్‌ను ప్రదర్శించారు. ప్రధాని మోదీ పరిశీలించి ‘ఆవిష్కరణలకు నాంది పలికారు’ అని అభినందించారు. ప్రస్తుతం ఆ స్టార్టప్ హెలెన్ బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది.