హలో.. సామ్..!
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:13 AM
ఆధునిక ప్రపంచంలో ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు మానవ జీవితాన్ని వేగవంతం చేస్తున్నాయి. రాయడం, నేర్చుకోవడం, ఏదైనా విషయాలను వేగంగా వెతకడంలో ఏఐ చాట్‌బాట్‌లు ఎంతగానో సాయపడుతున్నాయి.
ఏయూ మహిళా ఇంజనీరింగ్ విద్యార్థినుల అద్భుత ఆవిష్కరణ
తక్కువ ఖర్చుతో రూపకల్పన.. వినియోగించడం అత్యంత సులువు
అలెక్సా తరహాలో విభిన్న ఫీచర్లతో ఏఐ ఆధారిత వాయిస్ చాట్‌బాట్
విశాఖపట్నం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఆధునిక ప్రపంచంలో ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు మానవ జీవితాన్ని వేగవంతం చేస్తున్నాయి. రాయడం, నేర్చుకోవడం, ఏదైనా విషయాలను వేగంగా వెతకడంలో ఏఐ చాట్‌బాట్‌లు ఎంతగానో సాయపడుతున్నాయి. అయితే వీటికి మరిన్ని ఫీచర్లు జోడిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ విభాగం విద్యార్థినులు ఏఐ ఆధారిత వాయిస్ చాట్‌బాట్‌ను డిజైన్ చేశారు. అలెక్సా తరహాలో దీనికి ‘సామ్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఏఐ వాయిస్ ఆధారిత చాట్ బాట్‌లతో పోలిస్తే వీళ్లు రూపొందించిన ‘సామ్’లో విభిన్న ఫీచర్లు ఉన్నాయి. ఫైనలియర్ ప్రాజెక్టులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.అరవింద శిల్ప మార్గదర్శకంలో విద్యార్థినులు పసగడుగుల హర్షశ్రీ, ఎస్‌ఎల్‌ఎస్ సంజన, కె.సంధ్య దీన్ని రూపొందించారు. కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.పద్మశ్రీ, ఇతర అధ్యాపకులు సహకారం అందించారు.
అన్ని ఫీచర్లూ ఒకేచోట.. అదే దీని ప్రత్యేకత
ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు వాయిస్ ఆధారంగా సేవలందిస్తున్నాయి. ఏయూ విద్యార్థినులు డిజైన్ చేసిన రాస్బెర్రీ పై ఆధారిత ఏఐ చాట్‌బాట్‌లో అనేక రకాల సేవలు పొందవచ్చు. దీన్ని ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాల సాయంతో వినియోగించుకునే అవకాశం ఉంది. వాయి్‌సను టెక్ట్స్‌గా మార్చి సమాధానాన్ని రాబట్టే ఏఐ ఆధారిత వాయిస్ చాట్‌బాట్‌లు మార్కెట్‌లో కొన్ని ఉన్నాయని, అలాగే.. కొన్ని చాట్‌బాట్‌లు టెక్ట్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతోపాటు మ్యూజిక్ ప్లే చేయడం, ఫొటోలు తీయడం, వాటిని సేవ్ చేయడం వంటి సేవలూ అందిస్తాయని విద్యార్థినులు తెలిపారు. వీటన్నింటినీ కలిపి ఒకేచోట అందించేలా ఈ చాట్‌బాట్‌ను రూపొందించామని వారు తెలిపారు. ఫొటోలు తీసి.. వాటిని ఎక్కడ సేవ్ చేయాలన్న ఫీచర్‌తో కూడిన వాయిస్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారని చెబుతున్నారు. మాడ్యుల్ ఆధారిత నిర్మాణం వల్ల భవిష్యత్తులో మార్పులు చేసుకునేందుకు వీలుంటుందని అన్నారు.
వినియోగించిన టెక్నాలజీలు ఇవే..
ఈ వాయిస్ చాట్‌బాట్ కోసం ఓపెన్ సోర్స్‌లో ఉన్న పలు టెక్నాలజీలను విద్యార్థినులు వినియోగించారు. గూగుల్ వెబ్ స్పీచ్ ఏపీఐను వాయి్‌సను టెక్ట్స్‌గా మార్చేందుకు, జెమిని ఏఐను బోధనాత్మక సమాధానాల కోసం, జీటీటీఎ్‌సను టెక్ట్స్‌ను స్పీచ్‌గా మార్చేందుకు, ఓపెన్ వెదర్ మ్యాప్ ఏపీఐను వాతావరణ సమాచారం పొందేందుకు, యూట్యూబ్ డీఎల్‌పీ అండ్ వీఎల్‌సీని మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం, ఓపెన్ సీవీని ఫొటోలు తీసేందుకు వినియోగించారు. మూడు నెలల వ్యవధిలో కేవలం రూ.8 వేల ఖర్చుతో దీన్ని డిజైన్ చేశారు. వ్యక్తిగత వాయిస్ అసిస్టెంట్‌గా, విద్యా సంస్థల్లో ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్‌గా, ఇన్ఫర్మేషన్ కియో్‌స్కగా, దృష్టి లోపమున్న వారికి సహాయకారిగా, భవిష్యత్తులో స్మార్ట్ హోమ్ కంట్రోల్ వ్యవస్థగా వినియోగించుకునేలా దీన్ని రూపొందించారు. ఈ చాట్‌బాట్‌ను డిజైన్ చేసిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.పద్మశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.అరవింద శిల్ప అభినందించారు.