పోలీసింగ్‌లో ఏఐ విప్లవం
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:03 AM
పోలీసింగ్ వ్యవస్థలో సాంకేతిక విప్లవానికి ఏపీ పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. నేరాల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆధారాల సేకరణతోపాటు...
‘ఏఐ4ఏపీ పోలీస్’ ప్రాజెక్టుకు శ్రీకారం
3 జిల్లాల్లో ప్రారంభమైన పైలట్ ప్రాజెక్టు
ఎనిమిది ఏఐ టూల్స్‌తో సమగ్ర వ్యవస్థ
ఆరు నెలల్లో రాష్ట్రమంతా అమలుకు చర్యలు
అమరావతి, ఫిబ్రవరి4 (ఆంధ్రజ్యోతి): పోలీసింగ్ వ్యవస్థలో సాంకేతిక విప్లవానికి ఏపీ పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. నేరాల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆధారాల సేకరణతోపాటు ఇంటెలిజెన్స్ సమాచార విశ్లేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగిస్తూ ‘ఏఐ4ఏపీ పోలీస్’ ప్రాజెక్టును ప్రారంభించింది. మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరు, అన్నమయ్య, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిన పోలీసు శాఖ రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లో దీన్ని రాష్ట్రమంతా అమలు చేయనుంది. దీనికోసం అమెరికాకు చెందిన జనరేటివ్ ఏఐ సంస్థ ‘4సైట్ ఏఐ నాలెడ్జ్’, ‘స్పారిటీ’ సంస్థతో పోలీసు శాఖ ఏంవోయూ కుదుర్చుకుంది.
పోలీసు అవసరాలకు అనుగుణంగా..
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక టెక్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు, డ్రోన్లు, అత్యాధునిక ఎఫ్‌ఎ్‌సఎల్ సేవలను వినియోగంలోకి తీసుకొచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ పోలీసింగ్‌ను అమలు చేసేందుకు ఏపీ పోలీసుశాఖ గతేడాదే నడుం బిగించింది. దేశవ్యాప్తంగా ఏఐ నిపుణుల్ని ఆహ్వానించి 2025 జూన్‌లో గుంటూరులో దేశంలోనే తొలి ఏఐ హ్యాకథాన్‌ను నిర్వహించింది. శాంతి భద్రతల పరిరక్షణ మొదలుకొని పోలీసులకు అవసరమైన పలు సేవల్ని ఏఐ ద్వారా అందించేందుకు అనేక మంది ముందుకొచ్చారు. వాటిలో ఏపీ పోలీసులకు అవసరమైన వాటిని ఎంపిక చేసుకుని ప్రాజెక్టు రూపంలోకి తీసుకొచ్చారు. అమెరికాకు చెందిన ‘4సైట్ ఏఐ’ నాలెడ్జ్ సహకారం, ‘స్పారిటీ’ సంస్థ భాగస్వామ్యంతో 4 నెలలపాటు అభివృద్ధి చేసిన ఏఐ టూల్స్‌లో.. కీలకమైన 8 ఏఐ టూల్స్‌ను పోలీసు శాఖ ప్రవేశపెట్టింది. వాటిలో ‘పిటిషన్ ఏఐ’.. ఉన్నతాధికారుల ఫిర్యాదుల సమయాన్ని గణనీయంగా తగ్గిస్తే.. ‘డిజిటల్ ఎవిడెన్స్ ఏఐ’ టెలికామ్, బ్యాంకులు, పేమెంట్ గేట్ వేల నుంచి ఆధారాల సేకరణను వేగవంతం చేస్తుంది. ‘కాగ్నిటివ్ నెట్ ఏఐ’ దర్యాప్తు అధికారులకు డేటా విశ్లేషణలో సహకరిస్తే.. ‘ఇన్వెస్టిగేషన్ కో-పైలట్’ చట్టపరమైన దిశానిర్దేశం చేస్తుంది. పాత రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చే ‘డాక్స్2డేటా’.. సోషల్ మీడియా గూఢచారిగా పనిచేసే ‘సోకింట్ ఏఐ’, వార్తల పర్యవేక్షణకు ‘న్యూస్ 360ఏఐ’, మొత్తం వ్యవస్థకు పునాదిగా ‘ఏఐ ఫౌండేషన్’ పనిచేస్తాయి.
శిక్షల శాతం పెరుగుతుంది: డీజీపీ
‘ఏఐ4ఏపీ పోలీస్’ ప్రాజెక్టుతో దర్యాప్తులో వేగం పెరగడంతో పాటు ఆధారాల నాణ్యత మెరుగుపడి శిక్షల శాతం పెరుగుతుందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. పోలీసు అధికారులు చేసే సాధారణ పనిని ఆటోమ్యాటిక్‌గా ఏఐ చేయడంతో.. ఆ సమయాన్ని వారు శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగించవచ్చని చెప్పారు. భవిష్యత్తులో ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ ఏఐ ఏజెంట్లను ప్రవేశపెట్టే యోచన కూడా ఉందన్నారు. ‘ఏఐ4ఏపీ పోలీస్’ త్వరలోనే రాష్ట్రమంతా అమల్లోకి రాబోతోందన్నారు. కార్యక్రమంలో ఐజీ సీహెచ్ శ్రీకాంత్, పలువురు ఐపీఎ్‌సలు పాల్గొన్నారు.