Share News

అమరావతిలో ఏఐ యూనివర్సిటీ

ABN , Publish Date - Feb 09 , 2026 | 04:51 AM

రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం కొలువుదీరబోతోంది. కృత్రిమ మేధ(ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం..

అమరావతిలో ఏఐ యూనివర్సిటీ

  • ఈ నెల 19 నుంచే కార్యకలాపాలు?

మంగళగిరి(గుంటూరు), ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం కొలువుదీరబోతోంది. కృత్రిమ మేధ(ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ తాజాగా జీవో జారీ చేసింది. ఏఐ ఎకో సిస్టమ్‌, మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా కంపెనీల చట్టం 2013 సెక్షన్‌-8 కింద ‘లాభాపేక్ష లేని’ కంపెనీగా జీవోలో పేర్కొన్నారు. ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌ పేరుతో రాజధానిలో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ సంస్థ ఎన్‌విడియా(ఎన్‌వీఐడీఐఏ) కార్పొరేషన్‌తో ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మెమొరాండమ్‌ ఆఫ్‌ అసోసియేషన్‌, ఆర్టికల్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ను జారీచేసింది. ఈనెల 19 నుంచి వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని సమాచారం. ఈ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని జీవోలో పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, తయారీ, ఫిన్‌టెక్‌, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి ప్రాధాన్య రంగాల్లో ఏఐ వినియోగ మార్గాలను రూపొందించి అమలు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Updated Date - Feb 09 , 2026 | 04:53 AM