Share News

రైతు భవిష్యత్తుకు ఏఐ దిక్సూచి

ABN , Publish Date - May 16 , 2026 | 04:43 AM

వ్యవసాయ రంగాన్ని కృతిమ మేధ (ఏఐ) పూర్తిగా మార్చబోతోందని, భవిష్యత్‌ వ్యవసాయం మొత్తం డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థలవైపు పయనిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు.

రైతు భవిష్యత్తుకు ఏఐ దిక్సూచి

  • డేటా ఆధారిత వ్యవసాయమే రేపటి దారి.. ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి బి.రాజశేఖర్‌

  • పంటలకు సీఏటీ స్కానర్‌లా పనిచేస్తున్న డ్రోన్లు

  • ఐసీఏఆర్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సాహు

  • ఎన్‌జీ రంగా వర్సిటీలో విజయవంతంగా ఏఐ వర్క్‌షాప్‌

గుంటూరు సిటీ, మే 15 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగాన్ని కృతిమ మేధ (ఏఐ) పూర్తిగా మార్చబోతోందని, భవిష్యత్‌ వ్యవసాయం మొత్తం డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థలవైపు పయనిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రు), ఇక్రిశాట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘వ్యవసాయంలో కృతిమ మేధ’పై శుక్రవారం నిర్వహించిన జాతీయ వర్క్‌షా్‌పలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతు సేవా కేంద్రాల్లో కచ్చితమైన డేటా అందుబాటులో ఉంటేనే రైతుకు నిజమైన లాభం చేకూరుతుందన్నారు. చిన్న, సన్నకారు, కౌలు రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చేలా ఏఐ ఆవిష్కరణలు ఉండాలని సూచించారు. రైతుల ఆదాయం పెరగడం, పెట్టుబడి ఖర్చులు తగ్గడం, కోత అనంతర నష్టాలు తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రైతు కేంద్రీకృత డిజిటల్‌ వ్యవసాయ విధానాల రూపకల్పనలో ఎన్‌జీ రంగా వర్సిటీ ముందడుగు వేయడం ప్రశంసనీయమన్నారు. సదస్సులో ఐసీఏఆర్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రవినారాయణ సాహు.. ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతల భవిష్యత్‌ను విశదీకరించారు. ‘‘డ్రోన్‌ రిమోట్‌ సెన్సింగ్‌ పంటలకు సీఏటీ (కంప్యూటెడ్‌ యాక్సిల్‌ టోమోగ్రఫీ) స్కానర్‌లా పనిచేస్తోంది’’ అని చెప్పారు. డ్రోన్లు, ఉపగ్రహాలు, సెన్సర్ల సాయంతో పంటల్లో వ్యాధులు, పోషక లోపాలు, నీటి అవసరాలను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుందన్నారు.


మిరప పంటలో తెగుళ్లను 86 శాతం కంటే ఎక్కువ కచ్చితత్వంతో గుర్తించగలిగినట్లు వెల్లడించారు. ‘వసుధ’ అనే ఏఐ ఆధారిత నేల సారవంతతను అంచనా వేసే వ్యవస్థ ద్వారా కోట్ల రూపాయల ఖర్చు తగ్గించవచ్చన్నారు. ఏఐ, ఐఓటీ, 5జీ, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, జనరేటివ్‌ ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలు భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయని సాహు అభిప్రాయపడ్డారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ అక్షరాస్యత, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డేటా భద్రత వంటి సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.


రైతులకు సాంకేతికతను చేరువ చేయాలి: వీసీ

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ... వ్యవసాయ రంగం వాతావరణ మార్పులు, నీటి కొరత, కార్మికుల కొరత, పెరుగుతున్న సాగు ఖర్చులు, మార్కెట్‌ అస్థిరత వంటి సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. రైతులకు సాంకేతికతను చేరువ చేయడం, వ్యవసాయ-ఆహార వ్యవస్థలను ఆధునీకరించడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్‌ నిర్వహించినట్లు చెప్పారు.

Updated Date - May 16 , 2026 | 04:46 AM