Share News

ఏఐతో వ్యాధుల భారానికి బై బై

ABN , Publish Date - May 27 , 2026 | 05:16 AM

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం ద్వారా తక్కువ వ్యయంతోనే నాణ్యమైన వైద్యసేవలు అందించే వీలుంటుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

ఏఐతో వ్యాధుల భారానికి బై బై

  • తక్కువ వ్యయంతోనే నాణ్యమైన వైద్యసేవలు

  • ఏఐ వినియోగంలో మార్గదర్శక రాష్ట్రంగా ఏపీ

  • ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

అమరావతి, మంగళగిరి సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): వైద్య రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం ద్వారా తక్కువ వ్యయంతోనే నాణ్యమైన వైద్యసేవలు అందించే వీలుంటుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. వ్యాధులు, వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మయూరి టెక్‌ పార్క్‌లోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లో మంగళవారం నిర్వహించిన ఏఐ సేవల సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ‘మెడ్‌టెక్‌ చాలెంజ్‌’ విధానంలో వైద్యసేవల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ఉపయోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ మార్గదర్శక రాష్ట్రం (లైట్‌ హౌస్‌ స్టేట్‌)గా నిలిచిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ సేవలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో వ్యాధి నిర్ధారణలో కచ్చితమైన ఫలితాలు వస్తాయని, సమయం కూడా ఆదా కావడం వల్ల రోగులకు వీలైనంత త్వరగా నాణ్యమైన వైద్యం అందించవచ్చని తెలిపారు. దీనివల్ల రోగులపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు. తక్కువ వ్యయంతో నాణ్యమైన వైద్యం అందించేందుకు వీలుగా స్టార్ట్‌పలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

8 సంస్థలకు ప్రోత్సాహకాలు..

మెడ్‌టెక్‌ చాలెంజ్‌ ద్వారా దేశవ్యాప్తంగా అత్యుత్తమ ఆవిష్కరణలు చేసిన 18 స్టార్ట్‌పలను ఎంపిక చేసి... వారు తయారు చేసిన పరికరాల ద్వారా రాష్ట్రంలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సాంకేతికతను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టామని మంత్రి సత్యకుమార్‌ చెప్పారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన 8 సంస్థలను ఎంపిక చేసి నగదు ప్రోత్సాహాలు, ప్రశంసా ప్రతాలు అందిస్తున్నట్టు వెల్లడించారు.


ఏఐ వినియోగంలో ఏపీ ఆదర్శం: కిరణ్‌ గోపాల్‌

ఆరోగ్య రంగంలో ఏఐని వినియోగించడంలో ఏపీ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలకు ఆదర్శనంగా నిలిచిందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) జాయింట్‌ సెక్రటరీ కిరణ్‌ గోపాల్‌ వాస్క్‌ వెల్లడించారు. వైద్య సేవల్లో దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత ఆవిష్కరణలను వైద్య సేవల్లో ఉపయోగించిన ఏపీ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన కృషి ఇన్నోవేటర్లకు మార్గదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ - భాగస్వాముల సదస్సుకు ముఖ్య అతిఽథిగా విచ్చేసిన కిరణ్‌ గోపాల్‌ మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత వైద్య పరికరాలు కొనుగోలుకు అవసరమైన పాలసీని రూపొందిస్తున్నామన్నారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సీఈవో ధాత్రిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఉంచే అంకుర సంస్థలను ఆహ్వానిస్తున్నామని, ఇందుకోసం పెట్టుబడిదారులతో ఇన్వెస్టర్‌ ఆర్మీని తయారు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - May 27 , 2026 | 05:17 AM