ఏఐతో గుండె చికిత్సలో నూతన శకం
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:04 AM
గుండె సంబంధ వ్యాధుల ముందస్తు గుర్తింపు, కచ్చితమైన నిర్ధారణ, సమయోచిత చికిత్సలో కృత్రిమ మేధ (ఏఐ) కీలకపాత్ర పోషిస్తోందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేశ్ బాబు అన్నారు.
ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ రమేష్ బాబు
విజయవాడ, రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): గుండె సంబంధ వ్యాధుల ముందస్తు గుర్తింపు, కచ్చితమైన నిర్ధారణ, సమయోచిత చికిత్సలో కృత్రిమ మేధ (ఏఐ) కీలకపాత్ర పోషిస్తోందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేశ్ బాబు అన్నారు. ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాజమహేంద్రవరం శాఖ సహకారంతో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘ఏఐ ఇన్ కార్డియాలజీ-ఫ్రమ్ ఎర్లీ డిటెక్షన్ టు టైమ్లీ ఇంటర్వెన్షన్’ నిరంతర వైద్య విద్య (సీఎంఈ) కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో కార్డియాలజిస్టులు, వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. రమేశ్‌బాబు మాట్లాడుతూ... గుండె వైద్యంలో ఏఐ వినియోగం ప్రెసిషన్ మెడిసిన్ దిశగా కీలక అడుగని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గత ఐదేళ్లలో బైపాస్ సర్జరీలు, స్టెంట్ల అవసరం గణనీయంగా తగ్గినట్లు ఆయన చెప్పారు. హాస్పిటల్‌లో అమల్లో ఉన్న టెలి ఐసీయూ వ్యవస్థ ద్వారా సెంట్రల్ కమాండ్ స్టేషన్ నుంచి ఎక్కడైనా ఉన్న ఐసీయూ యూనిట్లను పర్యవేక్షించే అవకాశం ఉందని వివరించారు. ఈ విధానం వల్ల చికిత్స సమయం తగ్గడంతో పాటు మరణాలు, ఇన్‌ఫెక్షన్ రేట్లు తగ్గినట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాలు, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల నుంచి సుమారు 400 మంది వైద్యులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా జీఎ్‌సఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఏవీ సుబ్బారావు పాల్గొన్నారు. ఐఎంఏ రాజమహేంద్రవరం శాఖ అధ్యక్షుడు డాక్టర్ విజయభాస్కర్, కార్యదర్శి డాక్టర్ సతీశ్, ట్రెజరర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.