టెక్నాలజీతో నేరాలపై నిఘా
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:33 AM
నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలపై నిఘా, కేసుల దర్యాప్తు, క్షేత్రస్థాయిలో పోలీసుల స్పందనను మరింత వేగవంతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
ప్రజల ముంగిటకు పోలీస్ సేవలు: డీజీపీ హరీశ్‌గుప్తా
గుంటూరులో రెండు ఏఐ ఆధారిత యాప్‌లు ఆవిష్కరణ
గుంటూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలపై నిఘా, కేసుల దర్యాప్తు, క్షేత్రస్థాయిలో పోలీసుల స్పందనను మరింత వేగవంతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడంతోపాటు నేరాలపై ముందస్తు నిఘాను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఏఐ ఆధారిత సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ (సీడీఎంపీ), ‘సేఫ్ స్టే’ యాప్‌లు, లోగోలను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. హోటళ్లు, పీజీల్లో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు పోలీసులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ‘సేఫ్ స్టే’ వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. పోలీసులు డ్రోన్లను ఒకే వేదిక నుంచి పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. పోలీసింగ్‌కు అవసరమైన సాంకేతిక పరిష్కారాల రూపకల్పనలో విద్యాసంస్థలు, నిపుణులు అందిస్తున్న సహకారాన్ని డీజీపీ అభినందించారు. ఈ సందర్భంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ అగ్ని శ్రీనివాసరావు, ఆయా యాప్‌లు రూపొందించిన కేఎల్ యూనివర్సిటీకి చెందిన సాయి విజయ్ నేతృత్వంలోని ఐటీ నిపుణులైన విద్యార్థులకు డీజీపీ ప్రశంసా పత్రాలు అందించారు.