Share News

రైతు చేతిలో ఏఐ అస్త్రం

ABN , Publish Date - May 13 , 2026 | 04:54 AM

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం వాతావరణ మార్పులు, సాగు వ్యయాలు, నీటి కొరత, మార్కెట్‌ అస్థిరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్‌ వ్యవసాయ విప్లవానికి బాటలు పడుతున్నాయి.

రైతు చేతిలో ఏఐ అస్త్రం

  • కృత్రిమ మేధతో వ్యవ‘సాయం’.. ఏపీని డిజిటల్‌ అగ్రి హబ్‌గా మార్చే మహాయజ్ఞం

  • 15న ఆంగ్రు-ఇక్రిశాట్‌ జాతీయ వర్క్‌షాప్‌

  • వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగంపై చర్చలు

(గుంటూరు సిటీ - ఆంధ్రజ్యోతి)

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం వాతావరణ మార్పులు, సాగు వ్యయాలు, నీటి కొరత, మార్కెట్‌ అస్థిరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్‌ వ్యవసాయ విప్లవానికి బాటలు పడుతున్నాయి. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, ఐవోటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌), రిమోట్‌ సెన్సింగ్‌, రోబోటిక్స్‌, జీఐఎస్‌ వంటి సాంకేతికతలు వ్యవసాయ రంగానికి కొత్త ఆశలు నింపుతున్నాయి. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, మల్టీస్పెక్ట్రల్‌ కెమెరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఏఐ విశ్లేషించి రైతును ముందుగానే హెచ్చరిస్తుంది. పంటకు ఎక్కడ నీరు అవసరమో.. ఏ ప్రాంతంలో పోషక లోపం ఉందో.. ఎక్కడ తెగుళ్లు మొదలవుతున్నాయో.. ఎప్పుడు ఎరువులు వేయాలో.. మార్కెట్‌ ధరలు ఎలా ఉండబోతున్నాయో... అన్నీ రైతు మొబైల్‌కే చేరవేస్తుంది. దీంతో కచ్చితమైన వ్యవసాయం (ప్రెసిషన్‌ ఫార్మింగ్‌) సాధ్యమవుతుంది. అంటే అవసరమైన చోట మాత్రమే ఎరువులు, పురుగు మందులు వాడటం ద్వారా సాగు ఖర్చులు 20-40 శాతం వరకు తగ్గొచ్చు. దిగుబడులు 15-30 శాతం వరకు పెరగొచ్చు. ప్రస్తుతం ఏఐ, డ్రోన్లు, ఐవోటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) వంటి సాంకేతికతల వినియోగం 20 శాతం కన్నా తక్కువగా ఉండటం గమనార్హం. డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌కు బలంగా మారుతున్న ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతిక ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయ రంగంలో కూడా ఏఐ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఆంగ్రు), ఇక్రిశాట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15న గుంటూరులోని లాం ఫాంలో ‘ఏఐ ఫర్‌ అగ్రికల్చర్‌, డేటా-డ్రివెన్‌ డిజిటల్‌ ఇన్నోవేషన్స్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ అగ్రిఫుడ్‌ సిస్టమ్‌’ పేరుతో జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగంపై కీలక చర్చలకు వేదిక కానుంది. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ పీవీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగే ఈ వర్క్‌షా్‌పలో ఇక్రిసాట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ స్టాన్‌ఫోర్డ్‌ బ్లేడ్‌ సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొననున్నారు. కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా చిన్న, సన్నకారు రైతులకు టెక్నాలజీ ఎలా చేరువ చేయాలన్న దానిపై దృష్టి పెట్టడం ఈ వర్క్‌షాప్‌ లక్ష్యం.

Updated Date - May 13 , 2026 | 04:54 AM