ఏఐ యుగంలోనూ మానవ మేధస్సుకే అగ్రతాంబూలం
ABN , Publish Date - Mar 14 , 2026 | 06:15 AM
కృత్రిమ మేధస్సు (ఏఐ) ఎంతో వేగంతో అభివృద్ధి చెందుతున్నా.. విద్యార్థులు తమ సొంత మేధస్సు, విమర్శనాత్మక ఆలోచనా దృక్పథంపై విశ్వాసం కోల్పోకూడదని గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్ సూచించారు.
వైవీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
కడప, మార్చి 13(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధస్సు (ఏఐ) ఎంతో వేగంతో అభివృద్ధి చెందుతున్నా.. విద్యార్థులు తమ సొంత మేధస్సు, విమర్శనాత్మక ఆలోచనా దృక్పథంపై విశ్వాసం కోల్పోకూడదని గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్ సూచించారు. ఇప్పటికీ మానవ మేధస్సుకే అగ్రతాంబూలమన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం కడపలో శుక్రవారం జరిగింది. చాన్స్‌లర్ హోదాలో ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ భారతీయ జ్ఞాన వ్యవస్థలు కేవలం అక్షరాలే కావని, అవి జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిచ్చే అస్త్రాలన్నారు. డిగ్రీ అనేది కేవలం ఒక అర్హత పత్రం మాత్రమే కాదు, అది వ్యక్తిత్వం, సామర్థ్యం, నైతిక విలువలకు ప్రతిబింబమని విద్యార్థులకు సూచించారు. జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయని వీటిని అధిగమించేందుకు పట్టుదలే సోపానంగా ఉండాలన్నారు.. దీనికి క్రికెటర్ సంజీవ్ శాంసన్ ఉదాహరణ అన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం మాటలు స్మరిస్తూ స్వప్నం అంటే నిద్రలో వచ్చేది కాదు.. మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసే సంకల్పమని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. విద్యార్థులు మరింత నైపుణ్యం, సృజనాత్మకతతో పోటీ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొనేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలన్నారు. భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాలను పెంచుకునేందుకు ఆధునిక సాంకేతికతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కృతిమ మేథస్సు అభివృద్ధి జీవితంలోని అనేక రంగాల్లో మార్పు తెస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పేస్ రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కోట హరినారాయణకు గవర్నర్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. వైవీయూ నాలుగేళ్లకు (11, 12, 13, 14) కలిపి నిర్వహించిన ఈ స్నాతకోత్సవంలో 176 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 70 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్లు అందించారు. అలాగే 1194 మందికి పీజీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైవీయూ వీసీ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ పద్మ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు.