టీబీని గుర్తించే ఏఐ
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:18 AM
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం క్షయ (టీబీ) వ్యాధి ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో దేశాన్ని టీబీ రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోతున్నాయి
స్మార్ట్ ఫోన్ వద్ద దగ్గితే చాలు.. రోగ నిర్ధారణ
ఏఐ సాఫ్ట్‌వేర్ ఆధారిత ‘శ్వాస’ పరికరాన్ని రూపొందించిన ‘సాల్సిట్ టెక్నాలజీస్’ సంస్థ
సీవోపీడీ, ఆస్తమా వంటి వ్యాధులు కూడా..
ఆంధ్ర మెడికల్ కళాశాలతో కలిసి క్లినికల్ ట్రయల్స్
ఇప్పటివరకు 4 లక్షల మందికి పరీక్షలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం క్షయ (టీబీ) వ్యాధి ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో దేశాన్ని టీబీ రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించలేకపోవడమే..! అయితే ‘సాల్సిట్ టెక్నాలజీస్’ సంస్థ అభివృద్ధి చేసిన ‘శ్వాస’ అనే ఏఐ సాఫ్ట్‌వేర్ ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపుతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసిన స్మార్ట్ ఫోన్‌ను దగ్గరగా పెట్టుకుని దగ్గితే... అది టీబీతోపాటు మరికొన్ని రకాల వ్యాధులను గుర్తిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ మేరకు ఆంధ్ర మెడికల్ కళాశాలతోపాటు మరో ఎనిమిది ప్రముఖ సంస్థలతో కలిసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్‌లో సుమారు 15 వేల మంది, ఆ తర్వాత మరో 4 లక్షల మందికి ఈ పరికరంతో ఏఐ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం ఉండడంతో మెడ్‌టెక్ ఇన్నోవేషన్ చాలెంజ్-2025 కింద ఏపీ ప్రభుత్వం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో టీబీ రోగులను గుర్తించే పైలట్ ప్రాజెక్టును ఈ సంస్థకు అప్పగించారు. ఆరు వారాల్లో పది వేల మందికి పరీక్షలు నిర్వహించిన ఈ సంస్థ టీబీతో బాధపడుతున్న 11 మందిని గుర్తించింది. వీరిలో ఐదుగురికి అసలు లక్షణాలే లేవు. కానీ టీబీతో బాధపడుతున్నట్టు గుర్తించడం గమనార్హం.
రోగులను గుర్తించే ప్రక్రియ సులభం
‘‘ఏఐ ఆధారిత మెడికల్ డివైస్ ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులను సులభంగా గుర్తించే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పడంతో క్లినికల్ ట్రయల్స్‌కు అవకాశం కల్పించాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా రోగి దగ్గర ఫోన్ పెట్టి దగ్గును విశ్లేషించి వ్యాధిని గుర్తిస్తామని వారు చెప్పారు. విజయవంతమైతే ప్రజలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అప్పట్లో అవకాశం కల్పించాం. ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలు కూడా కచ్చితత్వంతో ఉండడంతో వారిని అభినందించాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా వారికి పైలట్ ప్రాజెక్టు కింద ఒక జిల్లా బాధ్యతలు అప్పగించింది. దీనివల్ల రోగ నిర్ధారణకు వేలాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఈ పరికరంతో రూపాయి ఖర్చు లేకుండా కింది స్థాయి వైద్య సిబ్బందే టీబీతోపాటు మరికొన్ని రకాల వ్యాధులను గుర్తించవచ్చు.’’
- డాక్టర్ పీవీ సుధాకర్,
ఆంధ్ర మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్
వ్యాధి గుర్తింపు ఇలా..
ఏఐ ఆధారిత మెడికల్ డివైస్‌కు ‘శ్వాస’ అనే పేరు పెట్టారు. దీన్ని డిజైన్ చేయడానికి ముందు.. ఆస్తమా, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు (సీవోపీడీ), టీబీ వంటి వ్యాధులతో బాధపడుతూ వైద్యుల వద్దకు వచ్చే రోగుల దగ్గును ఫీడ్ చేశారు. ఆ డేటాను విశ్లేషించిన అనంతరం ఏఐ ఆధారిత మెడికల్ డివైస్ ఫలానా వ్యాధి అనే సంకేతాన్నిస్తుంది. అప్పుడు సదరు రోగికి మరిన్ని పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించి అవసరమైన మందులు అందిస్తారు. వ్యాధి నిర్ధారణకు ఏఐ ఆధారిత మెడికల్ డివైస్ ద్వారా చేసే ప్రక్రియను ఆడియో మెట్రిక్ అనాలసి్‌సగా పేర్కొంటున్నారు. దీనివల్ల లక్షణాలు లేకుండా వ్యాధితో బాధపడేవారిని కూడా వేగంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్‌రే, సీటీ స్కాన్, కఫం వంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు. తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా టీబీతోపాటు సీవోపీడీ, ఆస్తమా వంటి వ్యాధులను కూడా గుర్తించినట్టు సంస్థ సీఈవో వెంకట్ ఏచూరి తెలిపారు. భవిష్యత్తులో జనరల్ మెడిసిన్ వైద్యులకు దీన్ని చేరువ చేసి మరింత వేగంగా బాధితులను గుర్తించేలా చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఇది పది సెకన్ల దగ్గును విశ్లేషించి మెరుగైన ఫలితాలను ఇస్తుందన్నారు. ఈ టెక్నాలజీతో కొవిడ్ బాధితులను కూడా గుర్తించినట్టు తెలిపారు.