న్యాయపరమైన ఆలోచనకు ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:24 AM
కృత్రిమ మేధ (ఏఐ) ఎన్నటికీ న్యాయపరమైన ఆలోచనా విధానాన్ని భర్తీ చేయలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ ప్యాట్రన్-ఇన్-చీఫ్ జస్టిస్ లిసాగిల్ అన్నారు. కొ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్
ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో 41 మంది
కొత్త సివిల్ జడ్జీలకు శిక్షణ ప్రారంభం
మంగళగిరి సిటీ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ) ఎన్నటికీ న్యాయపరమైన ఆలోచనా విధానాన్ని భర్తీ చేయలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ ప్యాట్రన్-ఇన్-చీఫ్ జస్టిస్ లిసాగిల్ అన్నారు. కొత్తగా నియమితులైన 41 మంది సివిల్ జడ్జీల (జూనియర్ డివిజన్)కు మంగళగిరిలోని జ్యుడీషియల్ అకాడమీలో శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం నూతన సివిల్ జడ్జిలకు దిశానిర్దేశం చేశారు. ఏఐని ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని, స్వతంత్ర న్యాయపరమైన తార్కిక ఆలోచనకు ఏఐ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి, జ్యుడీషియల్ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ.. నిజాయితీ, చిత్తశుద్ధితో పాటు మంచి వ్యక్తిత్వం, ప్రవర్తనను కలిగి ఉండాలని, ఆయా విషయాల్లో విధి నిర్వహణలో ఎవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి, జస్టిస్ హరిహరనాథశర్మ, న్యాయమూర్తులు జస్టిస్ జయసూర్య, జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల, జస్టిస్ సునీత గంధం, జస్టిస్ ఆలపాటి గిరిధర్, జస్టిస్ పురుషోత్తం కుమార్, ఏపీ న్యాయ అకాడమీ డైరెక్టర్ వైవీఎ్‌సబీజీ పార్థసారథి, అదనపు డైరెక్టర్ ఎల్.శ్రీధర్, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్-2 వై.బిందుమాధవి, పరిపాలనా అధికారి ఎం.శ్రీను, రిజిస్ట్రార్ జనరల్, రిజిస్ట్రార్లు న్యాయసేవల ప్రాధికార సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.