Share News

నవనారసింహులు కొలువైన ‘అహోబిలం’

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:18 PM

దేశంలో ఎక్కడా లేని విధంగా నవనారసింహులు కొలువైన క్షేత్రం అహోబిలం. ఆళ్లగడ్డ నుంచి 24 కిలోమిటర్ల దూరం లో ఉంది.

   నవనారసింహులు కొలువైన ‘అహోబిలం’
ఆళ్లగడ్డ మండలం లో వెలసిన అహోబిలం క్షేత్రం

రేపటి నుంచి ఫిబ్రవరి 19 వరకు పార్వేట ఉత్సవాలు

సర్వం సిద్ధం చేసిన మఠం అధికారులు

ఆళ్లగడ్డ, జనవరి 14(ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడా లేని విధంగా నవనారసింహులు కొలువైన క్షేత్రం అహోబిలం. ఆళ్లగడ్డ నుంచి 24 కిలోమిటర్ల దూరం లో ఉంది. ఎత్తైన కొండలు, గుహలు, జలపాతాలు, అడుగడుగునా ఆహ్లాదపరిచే వాతావరణం ఈ క్షేత్రంలోని ప్రత్యేకత. అహోబిలం క్షేత్రంలో ఒక రోజ గడిపితే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు శ్రీశైలం నుంచి తిరిగి వెళ్తూ అహోబిలానికి సమీపంలో బసచేసి శివలింగాన్ని తయారు చేయాలని స్వర్ణకారుడిని కోరారు. శివలింగానికి బదులు నరసింహస్వామి ఆకారం రావడంతో ప్రతాపరుద్రమహారాజు నరసింహస్వామిని దర్శించుకొని మొదటి పీఠాధిపతికి బంగారు విగ్రహాన్ని కానుకగా అందజేశారు. నేటికి ఈ విగ్రహం పీఠాధిపతులు వెంట తీసుకొస్తూ నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.

దిగువ అహోబిలం

ఈ క్షేత్రంలో లక్ష్మీసమేత నరసింహస్వామి దర్శనమిస్తారు. ఆలయం పక్కనే అమృతవల్లి అమ్మవారు, అండాళ్‌ సన్నిధి ఆలయాలున్నాయి. దిగువ అహోబిలానికి రెండు కిలోమిటర్ల దూరంలో యోగానంద నరసింహా స్వామి ఆలయం ఉంది. హిరణ్య కశిపుని వధించిన అనంతరం నరసింహాస్వామి ప్రహ్లదుడికి యోగవిద్యలోని మెలకువలు నేర్పడంతో ఈ స్వామిని యోగానందస్వామిగా పిలుస్తారు. దిగువ అహోబిలానికి కిలోమిటర్‌ దూరంలో యోగానంద నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఛత్రవట నరసింహస్వామి ఆలయం ఉంది.

ఎగువ అహోబిలం

వేదాద్రి, గరుడాద్రి పర్వతాల మద్య ఈ ఆలయం ఉంది. ఇక్కడ స్వయంభూగా నరసింహస్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శివ, నరసింహ, సుదర్శన, చెంచులక్ష్మి అమ్మవారిని దర్శించుకోవచ్చ. ఎగువ అహోబిలానికి కిలోమిటరు దూరంలో వరాహనరసింహాస్వామి ఆలయం ఉంది. వేదాద్రి పర్వతము నందు వేదములను, భూదేవిని సోమకాసురుడు అపహరించుకుపోగా వరాహ అవతారంలో శ్రీమన్నారాయణుడు భులోకానికి వెళ్లి సోమవాసురుడిని వధించి భూదేవితో సహా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రం వరాహనరసింహస్వామిగా ఖ్యాతి కెక్కింది.

పార్వేటకు ఏర్పాట్లు పూర్తి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు లక్ష్మీనరసింహ స్వామి పార్వేట ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీఈవో రామానుజన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవం ఈనెల 16వ రాత్రి బాచేపల్లె నుంచి ప్రారంభమౌతుందన్నారు. 17 సాయంత్రం కొండంపల్లె, అదేరోజు రాత్రి క్రిష్ణాపురం, 18న రాత్రి కోటకందుకూరు, 19న మర్రిపల్లె, 20న యాదవాడ, 21న రాత్రి ఆలమూరు, 23న మధ్యాహ్నం తిమ్మనపల్లె, రాత్రి నరసాపురం, 24న ముత్తలూరు, 25న నల్లవాగుపల్లె, 26న చెదలదిన్నె, రాత్రి బాచ్చాపురం, 27న నరసరావుపేట, రాత్రి నాగిరెడ్డిపల్లె, 28 పడకండ్ల, 30న ఆళ్లగడ్డ, అలాగే ఫిబ్రవరి 3వ తేదిన ఎస్‌లింగందిన్నె 4న నర్సాయిపల్లె, 5న ఎంపీడీవో కార్యాలయం, రాత్రి చింతకుంట, 6న దేవరాయపురం, రాత్రి గూబగుండం, 7న జంబులదిన్నే, 8న మందలూరు, 9న నక్కలదిన్నే, 10న చందలూరు, 11న చిలకలూరు, 12న తిప్పారెడ్డి పల్లె, 13న టి లింగందిన్నే, 14న ఆర్‌ నాగులావరం, 15న తువ్లపల్లె, 16న రుద్రవరం, 19న స్వామి ఉత్సవ పల్లకి అహోబిలం చేరుకుంటుందని తెలిపారు.

Updated Date - Jan 14 , 2026 | 11:18 PM