కమర్షియల్ ట్యాక్స్‌లో.. అహ్మద్‌బాబు వర్సెస్ ఉద్యోగులు
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:38 AM
రాష్ట్ర వాణిజ్య పన్నుల(రాష్ట్ర పన్నుల)శాఖలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన కమిషనర్ అహ్మద్‌బాబుపై ఉద్యోగుల సంఘం చేసిన ఆరోపణలపై విచారణ ..
ఈ బాబు మాకొద్దంటూ ఆఫీసుల బయట ఫ్లెక్సీల ఏర్పాటు
భోజన విరామ సమయంలో ఆందోళనలు
ఆ వెంటనే ఆఫీసు బేరర్‌కు స్థానచలనం
అమరావతి నుంచి కాశీబుగ్గకు బదిలీ
ప్రతీకార చర్య అంటూ ఉద్యోగుల ఆగ్రహం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర వాణిజ్య పన్నుల(రాష్ట్ర పన్నుల)శాఖలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన కమిషనర్ అహ్మద్‌బాబుపై ఉద్యోగుల సంఘం చేసిన ఆరోపణలపై విచారణ జరిపి రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఇటు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(డీఓపీటీ), అటు కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తయ్యేవరకు అహ్మద్‌బాబును వాణిజ్య పన్నుల శాఖతోపాటు సహకార, డెయిరీ డెవల్‌పమెంట్ విభాగాల నుంచి తప్పించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గత 2రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనిపై స్పందన లేకపోవడంతో వాణిజ్య పన్నులశాఖ సర్వీసుల విభాగం, ఎంప్లాయిస్ యూనియన్ బుధవారం నుంచే ఆందోళనలకు దిగాయి. రాష్ట్రంలోని ఆఫీసుల ప్రాంగణాల్లో ’అయ్యా బాబుగారు...మా కొద్దు ఈ బాబు. బాబు నుంచి మా శాఖను కాపాడండి. మేం ఉద్యోగులం, బానిసలం కాదు’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమరావతిలో ఉన్న వాణిజ్య పన్నుల ప్రధాన కార్యాలయం సహా రాష్ట్రంలోని కీలక ఆఫీసుల్లో వీటిని ఏర్పాటుచేయడంతో తీవ్రచర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగ సంఘం నేతలు ఆ ఫ్లెక్సీల వద్దకు వచ్చి ఆందోళనలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అహ్మద్‌బాబుపై విచారణ పూర్తయ్యేవరకు ఆయన్ను ఆయా శాఖల నుంచి తొలగించాలని డిమాండ్‌చేశారు. అయితే, భోజన విరామం అనంతరం వాణిజ్యపన్నుల ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శేషు బ్రహ్మజీపై వేటుపడింది. అమరావతిలోని ప్రధాన కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన్ను శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై పంపించారు. నేరుగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వకుండా, డిప్యూటేషన్‌పై కాశీబుగ్గ ఆఫీసులో పనిచేయాలని, ఈ ఆదేశం తక్షణమే అమల్లోకి వస్తుందని బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అహ్మద్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. పనిభారం ఎక్కువయినందున ఓ అధికారిని ఇవ్వాలని విజయనగరం జాయింట్ కమిషనర్ ఈనెల 28వ తేదీన కోరినట్లుగా బి.శేషుబ్రహ్మాజీని డిప్యూటేషన్‌పై విజయనగం డివిజన్ పరిధిలోని కాశీబుగ్గ ఆఫీసుకు పంపిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరిణామంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. అహ్మద్‌బాబు అక్రమాలపై పోరాటం చేస్తున్న తమపై ప్రతీకార చర్యలకు దిగారని ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.ఎం.రమే్‌షకుమార్ ఓ ప్రకటనలో విమర్శించారు. శేషుబ్రహ్మాజీని డిప్యూటేషన్ పేరుతో కాశీబుగ్గకు బదిలీచేయడం ప్రతీకారచర్యే అని పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రభుత్వంతోపాటు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.