ఆగ్రోస్.. ఇక అంతేనా!
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:50 AM
వ్యవసాయ రంగానికి మేలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఆగ్రోస్)..
రైతు సేవల్లో అలసత్వం
సాగుకు ఊతమిచ్చే చర్యల్లేవ్
నిధులు మురిగిపోతున్నా నిమ్మకునీరెత్తినట్లే..
గత ప్రభుత్వంలో అవకతవకలు
నేటికీ నెరవేరని అచ్చెన్న విజిలెన్స్ దర్యాప్తు హామీ
ఎండీలుగా ఐఏఎస్‌లు కరువు
20 నెలలైనా ఇన్‌చార్జీలే దిక్కు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వ్యవసాయ రంగానికి మేలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఆగ్రోస్).. రైతులకు సేవలు అందించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంస్థపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో.. వ్యవసాయానికి ఊతమిచ్చే యాంత్రీకరణ చర్యలు సైతం చేపట్టకుండా అలసత్వం ప్రదర్శిస్తోంది. వివిధ శాఖలు కోరిన యంత్రపరికరాలు సరఫరాలోనూ తాత్సారం చేస్తున్న ఆగ్రోస్.. చివరికి సొంత ఆస్తులనూ నిర్లక్ష్యం చేస్తోంది.
గత ప్రభుత్వంలోనే నిర్వీర్యం!
ఇప్పటి వరకు సుమారు 50 మంది ఐఏఎస్ అధికారులు ఆగ్రోస్‌కు మేనేజింగ్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. అయితే, గత ప్రభుత్వంలో నాన్ ఐఏఎ్‌సలకు ఆ బాధ్యతలు అప్పగించడంతో అనేక అవకతవకలకు జరిగాయి. నాటి అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు చేయిస్తామని సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు గత నవంబరులో ప్రకటించినా.. ఇప్పటికీ విచారణ జరగలేదు. గత పాలకుల అక్రమాల వల్ల పూర్తిగా నిర్వీర్యమైన ఈ సంస్థ కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా.. ఇన్‌చార్జి ఎండీలతోనే కాలం గడుపుతోంది. గత 20 నెలలుగా వ్యవసాయశాఖ డైరెక్టర్లకే ఆగ్రోస్ ఎండీ బాధ్యతలు అప్పగించింది. గతేడాది నెల్లూరు జిల్లాకు చెందిన మాలేపాటి సుబ్బానాయుడును చైర్మన్‌గా నియమించగా, ఆయన గత అక్టోబరులో ఆకస్మికంగా మరణించారు. అప్పటి నుంచి చైర్మన్ పోస్టు భర్తీ చేయలేదు. దీంతో పూర్తి స్థాయి పర్యవేక్షణ లేక ఆగ్రోస్‌లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. గతేడాది కొన్ని జిల్లాల రైతులకు వాటర్ షెడ్ పరికరాలను సరఫరా చేయించాలని పంచాయతీరాజ్‌శాఖ ఆగ్రోస్‌ను కోరింది. అయితే గత ప్రభుత్వ పెద్దలకు చెందిన కంపెనీకి టెండరు కట్టబెట్టేందుకు అధికారులు నిబంధనలనే మార్చేశారు. దీంతో నానా రచ్చ జరిగి, ఇతర కంపెనీలకు చెందిన ఐదుగురు కోర్టును ఆశ్రయించగా, పాత టెండరును నిలిపివేసి, తిరిగి స్వల్పకాల టెండరు పిలిచి, రైతులకు వాటర్‌షెడ్ పరికరాలను వెంటనే సరఫరా చేయాలని గత జనవరిలో కోర్టు ఆగ్రోస్‌కు తేల్చిచెప్పింది. అయినా ఇంత వరకు టెండర్లు పిలవలేదని సమాచారం. ఈ మార్చిలోపు ఖర్చు చేయాల్సిన నిధులు మురిగిపోయే పరిస్థితులున్నా.. అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
అటకెక్కిన ప్రాసెసింగ్ యూనిట్లు
రాష్ట్రంలో దాదాపు 20 మున్సిపాలిటీలు జేసీబీలు, కంపోస్ట్ ట్రాక్టర్లు, గార్బేజ్ మిషన్లు, వాటర్ ట్యాంకులు, ట్రాలీలు వంటి పనిముట్ల కోసం ధరల పట్టిక ఇవ్వాలని కోరుతున్నా కనీసం ధరల వివరాలు కూడా ఆగ్రోస్ అధికారులు ఇవ్వడంలేదని తెలుస్తోంది. దీని వల్ల రూ.5-6కోట్ల టర్నోవర్ ఆగిపోయింది. ఆగ్రోస్‌కు నూజివీడు, తిరుపతిలో ఉన్న మ్యాంగో ప్రొసెసింగ్ యూనిట్‌ను లీజుకు ఇస్తే.. ఏటా దాదాపు రూ.25లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ ఆ యూనిట్లను లీజుకు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడంతో ఆదాయం పోతోంది. అలాగే గుంటూరులో ఆగ్రోస్‌కు సొంత వర్క్‌షాప్ ఉంది. గతంలో వాటర్ ట్యాంకర్లు, ట్రాక్టర్ ట్రైలర్లు, డంపర్ బిన్లు తయారు చేసి, విక్రయించేవారు. వర్క్‌షా్‌పలో తగిన సిబ్బంది ఉన్నా.. వారి సేవలను వినియోగించుకోవడం లేదు. దీంతో ఆగ్రోస్ ఆదాయానికి గండిపడుతోంది.