అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:35 AM
అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రక్రియను వేగవంతం చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థకు 20,450 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామని, అందులో 6,330 ఎకరాలు బహిరంగ వేలంలో..
6,330 ఎకరాలు వేలం వేయాలని నిర్ణయం
విక్రయించిన డబ్బు బాధితులకు అందిస్తాం
ఈ నెలలోనే వేలం విధివిధానాలు ఖరారు
సెప్టెంబరు 15 నాటికి ప్రక్రియ ప్రారంభం
ఏజెంట్ల నుంచి బాండ్ల సేకరణకు ప్రత్యేక సెల్
ప్రజలకు ప్రత్యేక డ్యాష్ బోర్డుతో సమాచారం
వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్
అగ్రిగోల్డ్ సమస్యపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రక్రియను వేగవంతం చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థకు 20,450 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామని, అందులో 6,330 ఎకరాలు బహిరంగ వేలంలో విక్రయించి ఆ డబ్బును బాధితులకు అందజేయాలని నిర్ణయించామని వివరించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఈ నెలలోనే ఖరారు చేస్తామని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది. సంస్థ ఆస్తుల వేలం, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మనోహర్ చర్చించారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను సెప్టెంబరు 15లోగా అధికారికంగా ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో 11న మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఆస్తుల వేలానికి విధివిధానాలు ఖరారు చేస్తామని, అంతర్ రాష్ట్ర సమస్యలపైనా చర్చిస్తామని పేర్కొన్నారు. ‘‘బాధితులకు న్యాయం చేయడంలో పూర్తి పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్నాం. ఈ విషయంలో తీసుకొనే ప్రతి చర్యను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్, డ్యాష్ బోర్డును రూపొందిస్తున్నాం. న్యాయపరమైన చిక్కులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. సహారా తరహాలోనే అగ్రిగోల్డ్‌లో 5.85 లక్షల మంది ఏజెంట్లు ప్రజల నుంచి రూ.6,380 కోట్ల డిపాజిట్లు సేకరించారు. దీనిలో ఏపీలో రూ.3,944 కోట్ల వరకూ సేకరించారు. మొత్తం 18,57,290 మందికి ప్లాట్లు ఇస్తామన్న హామీతో సొమ్ములు సేకరిస్తే, దానిలో కేవలం 5,76,579 ప్లాట్లు మాత్రమే చూపించారు. భూమి పేరుతో తీసుకున్న డిపాజిట్లను పక్కదారి పట్టించారు’ అని మనోహర్ పేర్కొన్నారు.
భూముల లెక్క తేలింది
’అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేయాలనే లక్ష్యంతో మొత్తం భూములను గుర్తించాం. ఈ సంస్థకు దేశంలో 23,430 ఎకరాల స్థిరాస్తులు(భూములు) ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20,450 ఎకరాలు ఉన్నట్లు గుర్తించాం. ఇందులో ప్రభుత్వానికి 14,304 ఎకరాలను సీఐడీ అప్పగించింది’ అని మంత్రి తెలిపారు. ఎర్రచందనం, టేకు మొక్కలు పెంచుతామంటూ డిపాజిటర్లకు ఇచ్చిన హామీలపై తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనుమతితో సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాలని కోరతాం. వాటిని కూడా పూర్తిస్థాయిలో వేలం వేసేలా చర్యలు తీసుకుంటాం.’ అని మనోహర్ స్పష్టం చేశారు. ‘ఈ నెల 15 నాటికి అగ్రిగోల్డ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన కోర్టు భవనాన్ని సిద్ధం చేస్తాం. దీనికి న్యాయ నిపుణులు, సిబ్బందిని వెంటనే కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరతాం. ఏజెంట్ల వద్ద ఉండిపోయిన రూ.2వేల కోట్ల విలువైన బాండ్లను తిరిగి ఇవ్వాలని కోరాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏజెంట్లు ఇక్కడికి రావడం ఇబ్బందిగా ఉంది. సీఐడీ చీఫ్ రవిశంకర్‌తో చర్చించి ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసి, ఏ రాష్ట్రంలో బాండ్లు అక్కడే అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాం’ అని మంత్రి మనోహర్ వెల్లడించారు.
బాధితులకు అండగా ఉంటాం: ముప్పాళ్ల
అగ్రిగోల్డ్ బాధితులకు చివరి పైసా దక్కే వరకు అండగా ఉంటామని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. బాధితులకు 6 నెలల్లోగా డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 12 ఏళ్లుగా వేలాది కుటుంబాలను వేధిస్తున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తూ ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కొనియాడారు. మంత్రివర్గ ఉప సంఘానికి 11 అంశాలతో కూడిన విజ్ఞాపనా పత్రాన్ని ఇచ్చామని తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం దాచిన బినామీ ఆస్తులన్నింటినీ బయటకు తీయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ మోసానికి రాష్ట్రంలో దాదాపు 600 మందికి పైగా, ఇతర ఏడు రాష్ట్రాల్లో సుమారు 100 మంది అత్మహత్యలు, గుండెపోట్లతో మరణించారని, అర్హులైన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరామని తెలిపారు. ప్రజలను తీవ్రంగా వంచించిన అభయ గోల్డ్, అక్షయ గోల్డ్ వంటి సంస్థలఆస్తులు కూడా స్వాధీనం చేసుకుని, బాధితులకు చెల్లించేలా మంత్రివర్గ ఉప సంఘం, కోర్టు చర్యలు తీసుకోవాలని ముప్పాళ్ల కోరారు.