రూ.5.12 కోట్లతో వ్యవసాయ యంత్ర పరిక రాలు
ABN , Publish Date - May 06 , 2026 | 12:40 AM
వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. యంత్ర పరికరాల కొనుగోలు కోసం జిల్లాకు ఈ ఏడాది రూ. 5.12 కోట్లు కేటాయించింది. రైతులకు గరిష్టంగా 50 శాతం సబ్సిడీపై వీటిని అధికారులు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఆన్‌లైన్‌లో మంగళవారం ప్రారంభమైంది. రైతుల నుంచి విశేష స్పందన వస్తే లాటరీ పద్ధతిలో యంత్ర పరికరాలను కేటాయించనున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్, జేసీ, వ్యవసాయశాఖ జేడీలతో ఏర్పాటు కానున్న ప్రత్యేక కమిటీ లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయనుంది.
- నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- 19న దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు
- అధిక దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో కేటాయింపు
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్, జేసీ, వ్యవసాయశాఖ జేడీలతో ప్రత్యేక కమిటీ
- యంత్ర పరికరాలకు గరిష్టంగా రూ.50 వేల వరకు సబ్సిడీ
- రైతు మిత్ర గ్రూపులకు 80 శాతం సబ్సిడీతో డ్రోన్లు
వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. యంత్ర పరికరాల కొనుగోలు కోసం జిల్లాకు ఈ ఏడాది రూ. 5.12 కోట్లు కేటాయించింది. రైతులకు గరిష్టంగా 50 శాతం సబ్సిడీపై వీటిని అధికారులు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఆన్‌లైన్‌లో మంగళవారం ప్రారంభమైంది. రైతుల నుంచి విశేష స్పందన వస్తే లాటరీ పద్ధతిలో యంత్ర పరికరాలను కేటాయించనున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్, జేసీ, వ్యవసాయశాఖ జేడీలతో ఏర్పాటు కానున్న ప్రత్యేక కమిటీ లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయనుంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయానికి ఉపయోగించే యంత్ర పరికరాలను సబ్సిడీపై రైతులకు అందించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జిల్లాకు రూ.5.12 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అర్హత ఉన్న రైతులకు యంత్రాలను గరిష్టంగా రూ.50 వేల వరకు సబ్సిడీతో అందించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ-సైన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణను అధికారులు మంగళవారం ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకోనున్నారు.
సబ్సిడీపై ఇచ్చే పరికరాలు ఇవే..
జిల్లాలో 1.65 లక్షల హెక్టార్లలో వరి, చెరకు, మొక్కజొన్న, ఇంతర పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ నిమిత్తం రైతులకు యంత్ర పరికరాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (స్మామ్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ సంవత్సరానికి సంబంధించి రైతులకు 50 శాతం లేదా రూ.50 వేలకు తగ్గకుండా యంత్ర పరికరాలపై సబ్సిడీ ఇచ్చేలా ప్రణాళికను రూపొందించింది. ట్రాక్టర్ పరికరాలు, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, విత్తనం నాటే యంత్రాలు, మొక్కల పరిరక్షణ, పంట కోత, నూర్పిడి యంత్రాలు, పశుగ్రాసం కోసే యంత్రాలను రైతులకు ఇవ్వనున్నారు. జిల్లాకు కేటాయించిన నిధులను మండలాల వారీగా కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేసి పరికరాలను అందజేస్తారు.
లాటరీ పద్ధతిలో ఎంపిక
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాకు వచ్చిన నిధులను వినిగియోగించే అంశంపై కలెక్టర్ బాలాజీ ఆమోదం తెలిపి వ్యవసాయశాఖ అధికారులకు మార్గదర్శకాలను పంపారు. పరికరాలను తీసుకునేందుకు మండలాల వారీగా అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తే, లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు సబ్సిడీ పోనూ మిగిలిన మొత్తాన్ని యంత్ర పరికరాలు సరఫరా చేసే కంపెనీల పేరున డీడీల రూపంలో ముందస్తుగానే చెల్లించాల్సి ఉంది. గత ఏడాది ఈ-క్రాప్‌లో నమోదు చేసిన పంట వివరాలను ఖచ్చితంగా లబ్ధిదారులు దరఖాస్తు చేసే సమయంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు వారి పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి అక్కడి సిబ్బందితో సంప్రదింపులు జరిపి దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్న జేసీ, వ్యవసాయశాఖ జేడీ, ఇతర సభ్యులు పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50శాతం సబ్సిడీ
వ్యవసాయ యంత్ర పరికరాలను ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన రైతులు, మహిళా రైతులకు రూ.50 వేల వరకు సబ్సిడీగా ఇస్తారు. ఇతర సామాజిక వర్గాలు, పెద్ద రైతులకు 40 శాతం నగదును సబ్సిడీగా అందిస్తారు. ఒకే రైతు రెండు రకాల పరికరాల కోసం దరఖాస్తు చేసుకుంటే రెండింటికీ కలిపి రూ.50 వేల వరకు మాత్రమే సబ్సిడీగా అందజేస్తారు.
ఈ ఏడాది 25 డ్రోన్‌లకు ప్రతిపాదన
వరి, ఇతర పంటలకు తక్కువ ఖర్చుతో, తక్కువ వ్యవధిలో పురుగు మందులు, ఎరువులు పిచికారీ చేసే ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 25 డ్రోన్‌లను రైతు మిత్ర గ్రూపులకు ఇవ్వాలని జిల్లా వ్యవసాయశాఖ 2026 ఖరీఫ్ సీజన్ ప్రణాళికలో పొందుపరచి ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.10 లక్షలు ఉండగా, అందులో 80 శాతం సబ్సిడీగా ప్రభుత్వం ఇవ్వనుంది. మిగిలిన రెండు లక్షలను గ్రామస్థాయిలోని రైతు మిత్ర గ్రూపులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డ్రోన్‌ల వినియోగంపై రైతులు ఆసక్తి చూపుతున్నారని, వీటిని అందించాలని వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల నివేదికను పంపారు.