వ్యవసాయ ఇంజనీరింగ్‌కు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పడేనా?
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:48 AM
రాష్ట్రంలో వ్యవసాయ ఇంజనీరింగ్‌కు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుకోసం వేలాది మంది పట్టభద్రులు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ ఇంజనీరింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని...
పట్టభద్రుల ఎదురుచూపులు.. పట్టించుకోని ప్రభుత్వాలు
అమరావతి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ ఇంజనీరింగ్‌కు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుకోసం వేలాది మంది పట్టభద్రులు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ ఇంజనీరింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రాష్ట్రానికి లేఖలు రాసింది. అయినా గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇప్పటికే ఐసీఏఆర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి వ్యవసాయ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ వంటి కోర్సులు పూర్తిచేసి, దాదాపు 5వేల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఏటా గుర్తింపు పొందిన కాలేజీల నుంచి 100మందికి పైగా ఈ కోర్సులు పూర్తి చేస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా వ్యవసాయ ఇంజనీరింగ్ కోర్సు కొనసాగుతున్నా.. రాష్ట్రంలో ప్రత్యేక డైరెక్టరేట్ లేకపోవడంతో ఈ కోర్సు చేసిన విద్యార్థులకు ఏ ప్రయోజనం లేకుండా పోతోంది. వ్యవసాయ ఇంజనీరింగ్ అర్హతతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, జలవనరుల శాఖల్లో దాదాపు 120కిపైగా ఏఈఈ పోస్టులు ఉండగా, అవన్నీ దాదాపు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీనిపై వ్యవసాయ ఇంజనీరింగ్ పట్టభద్రులు అనేకసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి, పోస్టుల భర్తీ, కొత్త నియామకాల గురించి విన్నవించారు. కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మండల, జిల్లాస్థాయిల్లో కొత్త పోస్టులు మంజూరు చేసి, వీరిని నియమిస్తే.. రైతాంగానికి మేలు జరుగుతుందని వ్యవసాయ ఇంజనీరింగ్ పట్టభద్రులు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే వ్యవసాయ ఇంజనీర్లకు ప్రత్యేకంగా ఏఈఈ పోస్టులు మంజూరుచేశారని గుర్తు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతోపాటు కొత్త నియామకాలు చేపట్టాలని వ్యవసాయ ఇంజనీరింగ్ పట్టభద్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.