Share News

ఏజీఐసీఎల్‌ ఎండీ శ్రీనివాస్‌ రాజీనామా

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:39 AM

అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏజీఐసీఎల్‌) ఎండీ శొంటి వెంకటరత్న శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది..

ఏజీఐసీఎల్‌ ఎండీ శ్రీనివాస్‌ రాజీనామా

  • సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ అభిషేక్‌కు బాధ్యత

  • ఎంఏయూడీ నుంచి సహాయ నిరాకరణతో గతంలోనూ శ్రీనివాస్‌ రాజీనామా

  • పిలిపించి నచ్చచెప్పిన సీఎం చంద్రబాబు

  • రాజీనామాను వెనక్కి తీసుకున్న తర్వాతఎంఏయూడీ నుంచి మరిన్ని అవమానాలు

విజయవాడ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏజీఐసీఎల్‌) ఎండీ శొంటి వెంకటరత్న శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్థానంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ అభిషేక్‌ కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) అప్పగిస్తూ బుధవారం మునిసిపల్‌ పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ) ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సమర్థ అధికారి కావటంతో ఆయన సేవలు అమరావతికి అవసరమని భావించిన ప్రభుత్వం ఏజీఐసీఎల్‌ అనే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్పీవీ)ను ఏర్పాటు చేసి ఎండీగా కీలక బాధ్యతలు అప్పగించింది. సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ పరిధిలో ఉండే నిర్మాణ పనులన్నింటినీ ఏజీఐసీఎల్‌ పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించారు. వచ్చీ రాగానే అమరావతి పనులను పరుగులు పెట్టించేందుకు ఆయన కార్యాచరణతో రంగంలోకి దిగారు. పనుల్లో వేగం పెంచేందుకు కాంట్రాక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించేవారు. అయితే శ్రీనివా్‌సకు ఎంఏయూడీ నుంచి సహకారం లభించలేదు. నిజానికి ఎంఏయూడీ అమరావతి నిర్మాణ పనులన్నింటినీ ఆజమాయిషీ చేస్తోంది. ఎండీగా బాధ్యతలు తీసుకుని నెలలు గడుస్తున్నా శ్రీనివా్‌సకు జీతభత్యాలు ఇవ్వకపోవటం.. ఒక ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహించటానికి డిజిటల్‌ కీ వంటివి కల్పించకపోవటంతో ఆయన పూర్తిస్థాయిలో పరిపాలన సాగించలేని పరిస్థితి నెలకొంది. ఏజీఐసీఎల్‌లోని కిందిస్థాయి అధికారులు, సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ ఉన్నతాధికారులు, అధికారులు కూడా ఆయన్ను లెక్క చేయని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆయన అప్పట్లోనే రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నచ్చచెప్పి రాజీనామాను ఉపసంహరింపచేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఎంఏయూడీ సైలెంట్‌ అయినా.. తర్వాత మళ్లీ పాత విధానంలోనే వ ్యవహరించింది. గతం కంటే డోస్‌ పెంచి చాలా అమర్యాదగా చూడటంతో శ్రీనివాస్‌ నొచ్చుకున్నారు. ఇదే సందర్భంలో మంత్రి నారాయణ దృష్టికి ఆయన తీసుకువెళ్లినట్టు సమాచారం. మంత్రి పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టినా.. ఎంఏయూడీ వైఖరి మారలేదు. ఎంఏయూడీ అధికారుల నుంచి మరిన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి రావటంతో ఇక ఇక్కడ పనిచేయలేనని భావించి రాజీనామాను సమర్పించారు. శ్రీనివా్‌సకు రిలయెన్స్‌ సంస్థ భారీ ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎంఏయూడీ అధికారులతో అవమానాలు పొందే కన్నా రిలయెన్స్‌లో పనిచేయటం మేలని ఆయన భావించినట్టు సమాచారం.

Updated Date - Jul 02 , 2026 | 03:39 AM