ఏజెన్సీలో చలి తీవ్రత
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:15 AM
ఉత్తరాది నుంచి చలిగాలులు మధ్యభారతం మీదుగా తెలంగాణ, ఏపీ వరకూ విస్తరించాయి.
హుకుంపేటలో 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖపట్నం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఉత్తరాది నుంచి చలిగాలులు మధ్యభారతం మీదుగా తెలంగాణ, ఏపీ వరకూ విస్తరించాయి. ముఖ్యంగా పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో నెలకొన్న శీతల వాతావరణం ఏపీపై ప్రభావం చూపుతోంది. రెండు, మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగినా రాత్రి మాత్రం చలి వాతావరణం కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంది. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో 5.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు దట్టంగా కురిసింది. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో మరో రెండు, మూడు రోజుల పాటు పొగమంచు ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది.