Share News

సైకో సాధిక్‌ ఎక్కడ?

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:48 AM

పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కారకుడైన రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌ షేక్‌ సాధిక్‌ ఖాన్‌ జాడ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

సైకో సాధిక్‌ ఎక్కడ?

  • ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితుడి కోసం ముమ్మర గాలింపు

  • ఫోన్‌ వాడకుండా తిరుగుతున్న వైనం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కారకుడైన రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌ షేక్‌ సాధిక్‌ ఖాన్‌ జాడ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం తెలియగానే సాధిక్‌ కాకినాడ నుంచి పారిపోయాడు. అతడి ఆచూకీ కోసం ఐదు బృందాలతో గాలిస్తున్న పోలీసులు.. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించారు. అతడు ఫోన్‌ వాడకుండా తిరుగుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే పారిపోయే సమయంలో సాధిక్‌ ఖాన్‌ వద్ద రూ.15 వేల నగదు మాత్రమే ఉన్నట్టు పోలీసులు గుర్తించా రు. దీంతో సాధిక్‌ ఖాన్‌ డబ్బు అవసరాల కోసం ఏం చేస్తున్నాడనే దానిపై నిఘా ఉంచారు. మరోవైపు నూకరాజు సూసైడ్‌ నోట్‌ లభ్యమైన వెంటనే పోలీసులు సాధిక్‌ ఖాన్‌ ఇంటికి వెళ్లి అతడి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీచేశారు. సాధిక్‌కు వివిఽధ రాష్ట్రాల్లో పరిచయస్తులు ఉన్నారు. ఈ క్రమంలో అతడు తన సన్నిహితుల వద్దకు వెళ్లి ఉంటాడనే కోణంపై పోలీసులు దృష్టిసారించారు. హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా వంటి ప్రాంతాలకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బృందాలను పంపారు. కాకినాడలో ఓ కార్పొరేట్‌ స్కూల్లో రైఫిల్‌ షూటర్‌ కోచ్‌గా ఉన్న సాధిక్‌ గురించి స్కూలు యాజమాన్యం ద్వారా ఆరా తీస్తున్నారు.


నా మనవడికి ప్రాణహాని..

ఆత్మహత్మయత్నం నుంచి బయటపడిన నూకరాజు మనవడు రియాన్స్‌ కార్తికేయరెడ్డి ఈ కేసులో కీలక సాక్షి. సాధిక్‌ విషయాలు అతనికి తెలుసు. దీంతో తమ మనవడికి సాధిక్‌ నుంచి ప్రాణహాని ఉందని తాతయ్య భాస్కరరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్తికేయరెడ్డి తమ వద్దే ఉ న్నాడని తెలిపారు. తన ఫిర్యాదులో పేర్కొన్నది అం తా నిజమని, సాధిక్‌ రాక్షసుడని, ఎంతోమం ది జీవితాలతో ఆడుకున్నాడని, తన కొడుకు జీవితాన్ని అతడే నాశనం చేశాడని, స్లోపాయిజన్‌ ఇస్తూ చంపేశాడని అన్నారు. సాధిక్‌ అరాచకాలపై గతం లో 10 మంది ఫిర్యాదులు చేసినట్టు తెలిసిందని అన్నారు.


సౌజన్య మృతదేహం లభ్యం

రాజమహేంద్రవరం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న రాత్రి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కూతురు సౌజన్య మృతదేహం గురువారం లభ్యమైంది. గోదావరి ప్రవాహంతో మృతదేహాలు దిగువకు వెళ్లిపోయిన క్రమంలో కోనసీమలోని కొమరాజులంక సమీపంలో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో గోదావరి ఒడ్డున సౌజన్య మృతదేహం లభ్యమైంది. ఘటన జరిగి నాలుగు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. కాగా, సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి రావులపాలెంకు చెందినవారు. కొమరాజులంక గ్రామం రావులపాలెంకు ఆనుకునే ఉంటుంది.

Updated Date - Aug 21 , 2026 | 04:52 AM