తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:18 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిన వ్యవహారం తీవ్ర విమర్శలకు కారణమైంది.
నెయ్యి కల్తీకి చెక్ పెట్టేలా ప్రభుత్వ నిర్ణయం
రూ.25 కోట్ల ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిధులతో ఏర్పాటు
మార్చి నుంచి ల్యాబ్ సేవలు అందుబాటులోకి
ఫ్రాన్స్ నుంచి ‘ఈ-టంగ్.. ఈ-నోస్’ మిషన్లు
200 రకాల అవశేషాలను గుర్తించే సామర్థ్యం
అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిన వ్యవహారం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో కల్తీకి అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబరేటరీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదివారం ప్రకటించారు. భక్తులకు సురక్షితమైన, నాణ్యత కలిగిన ప్రసాదాలు, ఆహారాన్ని అందించేందుకు ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో సిద్ధం చేస్తున్న ఈ ల్యాబ్ కార్యకలాపాలు మార్చిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. రూ.25 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ ల్యాబ్‌లో స్వామి వారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పు, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు, కారం వంటి 60 రకాల ముడిసరకులు, ప్రసాదాల నాణ్యతను పరీక్షిస్తారని చెప్పారు. ల్యాబ్ ఏర్పాటు పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. కల్తీ నెయ్యిని దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాబ్‌లో ప్రత్యేకంగా ‘‘ఈ-టంగ్ అండ్ ఈ-నోస్’’ మిషన్లను రూ.3.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫ్రాన్స్ నుంచి తీసుకొస్తున్న ఈ మిషన్లు నెయ్యి నాణ్యతలో అత్యంత సూక్ష్మస్థాయిలో లోపం ఉన్నా పసిగడతాయని తెలిపారు. ఈ పరికరాలు మే తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ల్యాబ్ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) రూ.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆరోగ్యశాఖ, ఎఫ్‌ఎస్ఎస్ఏఐ మధ్య ఒప్పందం 2024 అక్టోబరు 8న ఢిల్లీలో జరిగిందని చెప్పారు. టీటీడీ అధికారులు కూడా తిరుమలలోని పిండిమిల్లు ఆవరణలోని పాత భవనాన్ని కేటాయించారన్నారు.
ల్యాబ్‌లో 200 రకాల పరీక్షలు..
ఆహార పదార్థాలు, ప్రసాదాల్లో 200 రకాల పురుగు మందుల అవశేషాలను గుర్తించే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఈ ల్యాబ్ ద్వారా అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ ల్యాబ్‌లో టీటీడీ జలప్రసాదాల నమూనాలను కూడా పరీక్షిస్తారని, వీటన్నింటి కోసం మొత్తం 50 రకాల పరికరాలు ఈ ల్యాబ్‌లో ఉంటాయని చెప్పారు. ఈ ల్యాబ్ నిర్వహణ కోసం వివిధ హోదాల్లో కలిపి 40 మంది ఉద్యోగులను వైద్య ఆరోగ్యశాఖ, టీటీడీ సంఅందుబాటులోకి తీసుకువస్తున్నాయని తెలిపారు. ఈ ల్యాబ్ నిర్వహణపై వైద్య ఆరోగ్యశాఖ, టీటీడీ మధ్య త్వరలో మరో ఒప్పందం జరుగుతుందన్నారు.