గుంటూరు, కడపలో ఆధునిక క్యాన్సర్ చికిత్స
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:27 AM
గుంటూరు, కడప ప్రభుత్వాస్పత్రులలో ఆరోగ్య, మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఓఎన్‌జీసీ సంస్థ సీఎ్‌సఆర్ నిధులను అందించేందుకు ముందుకు రావడంపై కేంద్ర పెట్రోలియం...
ఓఎన్‌జీసీ సీఎ్‌సఆర్‌తో రెండు లైనాక్ యంత్రాలు మంజూరు
కేంద్ర మంత్రి హర్‌దీ్‌పసింగ్‌కు పెమ్మసాని కృతజ్ఞతలు
న్యూఢిల్లీ/గుంటూరు మెడికల్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): గుంటూరు, కడప ప్రభుత్వాస్పత్రులలో ఆరోగ్య, మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఓఎన్‌జీసీ సంస్థ సీఎ్‌సఆర్ నిధులను అందించేందుకు ముందుకు రావడంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్‌దీ్‌పసింగ్ పూరికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం పార్లమెంటులో హర్‌దీ్‌పసింగ్ పూరిని ఆయన కార్యాలయంలో పెమ్మసాని కలిశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా.. రూ.60 కోట్ల విలువైన అత్యాధునిక లైనాక్ యంత్రాలను గుంటూరు, కడప ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించడం క్యాన్సర్ చికిత్సకు గొప్ప ఊతమని, దీని ద్వారా ఏపీ, పొరుగు రాష్ట్రాల రోగులకు సమయానుకూలంగా, ప్రపంచ స్థాయి రేడియోథెరపీ సేవలు అందుబాటులోకి వస్తాయని పెమ్మసాని తెలిపారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్ర్కీనింగ్‌లో లక్షలాది మందిని పరీక్షించగా, 22,888 అనుమానాస్పద క్యాన్సర్ కేసులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేలాది మందికి పైగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓఎన్‌సీజీ సంస్థ సీఎ్‌సఆర్ కింద గుంటూరు, కడప ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కొక్కటీ సుమారు రూ.30 కోట్ల విలువైన రెండు అత్యాధునిక లైనాక్ యంత్రాలను అందజేసింది. ఈ యంత్రాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సకు ఊతం లభిస్తుంది. ఈ యంత్రాల కోసం అవసరమైన ప్రత్యేక బంకర్లు, మౌలిక వసతులు, శిక్షణ పొందిన ఆంకాలజిస్టులు, సాంకేతిక సిబ్బంది ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. యంత్రాల ఏర్పాటు పూర్తయిన వెంటనే వైద్యసేవలు ప్రారంభించే అవకాశం ఉంది. యంత్రాల కొనుగోలు ప్రక్రియను హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ద్వారా అమలు చేయనున్నారు.