Share News

పాలకూట విషం!

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:27 AM

తల్లి పాల వలే.. పాడి పశువుల నుంచి వచ్చే పాలు కూడా స్వచ్ఛమైనవని, కల్తీ ఉండదని అంతా భావిస్తారు. కానీ చూడగానే తెల్లటి నురుగు పొంగుతో చిక్కగా కనిపించే పాలల్లో కల్తీ..!

పాలకూట విషం!

  • కాసుల కక్కుర్తితో వ్యాపారుల కల్తీ పా‘పాలు’

  • యూరియా, కెమికల్స్‌, ఇతర పదార్థాల వినియోగం

  • అప్పుడే తీసిన పాలలా తెల్లని నురుగు

  • అత్యాశతో ప్రజల ప్రాణాలతో చెలగాటం

  • నాలుగో వంతు పాల విక్రయాలు ఇళ్ల ముందే

  • ఉమ్మడి గోదావరి జిల్లాల్లో విరివిగా..

  • నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఏదీ?

  • విడి పాల విక్రయాలపై అజమాయిషీ కరువు

  • ఇదే అదునుగా కొందరి కల్తీ దందా

  • ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలూ పేరుకే

  • డెయిరీలు, కలెక్షన్‌ సెంటర్లకే మిల్క్‌ యాక్ట్‌

రోజూ నిద్ర లేవగానే చిన్నారులు, మహిళలు, ఇంటిల్లిపాదికీ పాలు లేకపోతే ఉదయం గడవదు. సైకిళ్లు, మోటార్‌ సైకిళ్లపై పాల క్యాన్లతో వ్యాపారులు ఇళ్ల ముందు వాలిపోతుంటారు. చిరువ్యాపారులు తీసుకొచ్చే గేదె, ఆవు పాలు స్వచ్ఛంగా ఉంటాయని భావించి చాలామంది వారి వద్ద కొనుగోలు చేస్తుంటారు. అయితే వినియోగదారుల నమ్మకాన్ని కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కాసుల కక్కుర్తితో స్వచ్ఛమైన పాలలో నీళ్లతో పాటు పంటలకు ఎరువుగా వేసే యూరియా కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇళ్ల ముందు విడిగా అమ్ముకునే పాలల్లో నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఎక్కడా లేదు. ఇదే అదునుగా కొందరు కల్తీపా‘పాలు’ చేస్తున్నారు.

100 లీటర్ల పాలల్లో 100 లీటర్ల నీళ్లు, 10 కిలోల యూరియా కలిపి కల్తీ పాలు తయారీ చేస్తున్నట్లు సమాచారం. పాలు చిక్కగా, నురుగుతో కనిపించడానికి యూరియా.. వెన్న శాతం తగ్గకుండా ఉండటానికి కొన్ని ఫ్లేవర్లతో కూడిన పదార్థాలు వాడుతున్నట్లు తెలిసింది. 45 కిలోల యూరియా బస్తా కేవలం రూ.298. 10 కిలోల యూరియా ధర రూ.70 లోపు ఉంటుంది. విడిగా లీటరు పాల ధర రూ.80. అనేక రెట్ల సొమ్ము వస్తుందనే దురాశతో కొందరు వ్యాపారులు కల్తీ పాపానికి ఒడిగడుతున్నట్లు పాల నిపుణులు చెప్తున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తల్లి పాల వలే.. పాడి పశువుల నుంచి వచ్చే పాలు కూడా స్వచ్ఛమైనవని, కల్తీ ఉండదని అంతా భావిస్తారు. కానీ చూడగానే తెల్లటి నురుగు పొంగుతో చిక్కగా కనిపించే పాలల్లో కల్తీ..! గేదెలు, ఆవుల నుంచి తీసే పాలు కొందరు వ్యాపారుల వద్దకు రాగానే కేవలం కల్తీనే కాదు.. విషంగా మారుతున్నాయి..! కాసుల కక్కుర్తితో పాలల్లో చేస్తున్న కల్తీ.. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్వచ్ఛమైన పాలు అమ్మాల్సిన వ్యాపారులు నీళ్లలో విషపూరిత రసాయనాలు కలిపి పాలులా తయారీ చేసి విక్రయిస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ తరహా వ్యాపారం జోరుగా సాగుతోంది. దీనిపై ప్రభుత్వం ఇన్నాళ్లూ ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. స్వచ్ఛమైన, నాణ్యమైన, అప్పుడే తీసిన పాలు అని ప్రచారం చేసుకునే వారి దగ్గర విడి పాలు కొనుగోలు చేయడం ఎంతో మందికి అలవాటు. గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. చిక్కగా, తెల్లగా, నురగలతో చక్కగా కనిపించే లీటర్‌ పాలును రూ.80-90 పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలుదారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు అత్యాశతో కల్తీ పాపానికి ఒడిగడుతున్నారు.


యూరియాతో పాలకల్తీ: కల్తీ పాల తయారీకి యూరియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొద్దిగా పాలు, మరిన్ని నీళ్లలో యూరియా కలిపితే మొత్తం పాలుగానే కనిపిస్తాయి. గేదెలు, ఆవుల నుంచి అప్పుడే తీసిన పాలులా నురగతో ఉంటాయి. పాలల్లో కల్తీ అనేది చాలా కాలంగా స్వార్థపరులు కనిపెట్టిన విద్య. ఈ తరహా కల్తీ పాలను మిల్క్‌ కలెక్షన్‌ పాయింట్లకు తక్కువగా, రోజూ ఇళ్ల ముందు అమ్మేందుకు ఎక్కువగా సరఫరా చేస్తుంటారని సమాచారం. 100 లీటర్ల పాలల్లో 100 లీటర్ల నీళ్లు, 10 కిలోల యూరియా కలిపి కల్తీ పాలు తయారీ చేస్తున్నట్లు సమాచారం. 10 కిలోల యూరియాకు రూ.70 కూడా ఖర్చు కాదు. ఒక లీటరు స్వచ్ఛమైన లూజు పాలు రూ.80. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విడిపాలు సేకరించి విక్రయిస్తుండగా, ఇందులో కొంతమంది కల్తీలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. పదుల సంఖ్యలో ఉన్న ప్రైవేటు డెయిరీల్లోనూ ఈ తరహా కల్తీలు జరుగుతున్నట్లు అనుమానాలున్నాయి.

కానీ అతి పెద్ద యంత్రాంగం ఉన్న పశు సంవర్థకశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య, పశుగణాభివృద్ధి సంస్థ పాల ఉత్పత్తి, రవాణా, విక్రయాలు, కల్తీ వ్యవహారాలపై స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కూడా సమస్య వచ్చినప్పుడో, విమర్శ వచ్చినప్పుడో స్పందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఏలూరు జిల్లాలోనూ కల్తీ పాల కలకలం రేపింది. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితులపై నిఘా లోపించడంతో ఇప్పుడు కల్తీ పాల తంతు రాజమహేంద్రవరంలో వెలుగులోకి వచ్చింది.


చిరువ్యాపారుల దందా

మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్లలో వెన్న(ఫ్యాట్‌) కొలిచే యంత్రం ఉంటుంది. కల్తీ పాలు కూడా చిక్కగా, తగిన మోతాదులో వెన్న శాతం ఉండేలా యూరియా, ఇతర కెమికల్స్‌ కలుపుతున్నట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. కానీ స్వయం ఉపాధిగా చిరు వ్యాపారులు ఇళ్ల ముందు అమ్ముకునే పాలల్లో నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఎక్కడా లేదు. పాల ఉత్పత్తిని పర్యవేక్షించే పశుసంవర్థక శాఖకు పాల విక్రయాలు, కల్తీ పాల తయారీ నిరోధక విధానంపై అజమాయిషీ లేదు. 2024లో మిల్క్‌ యాక్ట్‌ అమలులోకి వచ్చినా.. రైతుల ఇళ్ల వద్ద పాలు సేకరించి, ఇంటింటికీ తిరిగి అమ్ముకోవడానికి లైసెన్సులు జారీ చేసే విధానం లేదు. దీంతో పాల వ్యాపారుల అక్రమాలకు ఊతమిచ్చినట్లు అవుతోంది. రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 139,46,13,000 టన్నుల పాలు ఉత్పత్తి అయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో మూడొంతులు డెయిరీలకు వెళ్తుండగా, మిగిలినవి స్థానికంగా పాల వ్యాపారులు సేకరించి, ఇళ్ల ముంగిటకు వెళ్లి అమ్ముతున్నారు.


మిల్క్‌ యాక్ట్‌ ఉన్నా..

పాల సేకరణ, పాడి రైతుల రక్షణ, పాల ప్రమాణాల భద్రత అమలు చట్టం-2023 ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉంది. ఈ చట్ట ప్రకారం రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ మిల్క్‌ కమిషనర్‌గా గత ప్రభుత్వం పేర్కొంది. వాస్తవంగా పశుసంవర్థకశాఖ పాల ఉత్పత్తి వరకే బాధ్యత వహిస్తుంది. పాడి పరిశ్రమాభివృద్ధికి ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ ఫెడరేషన్‌ ప్రత్యేకంగా ఉన్నా.. పశుసంవర్థకశాఖకు ఈ చట్టాన్ని అన్వయించింది. దీంతో డెయిరీలకు పాలు సరఫరా చేసే మిల్క్‌ కలెక్షన్‌ ఏజెంట్లకు మాత్రమే ఈ చట్ట ప్రకారం జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు లైసెన్సులు జారీ చేస్తున్నారు. లైసెన్సు ఉన్న సేకరణ కేంద్రాల నుంచే డెయిరీలు పాలు సేకరించాల్సి ఉంది. లైసెన్స్‌దారుల దగ్గర పాల విశ్లేషణ పరికరాల నిర్వహణలో లోపాలు గుర్తిస్తే.. జరిమానాలు విధించడం మినహా కఠిన చర్యలు తీసుకునే విధానం కూడా లేదు. తనిఖీ అధికారులు కేవలం పాల విశ్లేషణ యంత్రాలను స్వాధీనం చేసుకోవచ్చు. డెయిరీలు నాణ్యత ప్రమాణాల ప్రకారం పాల ఉత్పత్తిదారులకు సరసమైన ధర చెల్లిస్తాయి. అయితే అథీకృత అధికారి జారీ చేసిన లైసెన్స్‌ లేకుండా ఏ వ్యక్తి కూడా పాలను సేకరించకూడదనే నిబంధన ఉంది. కానీ రైతుల నుంచి నేరుగా పాలు సేకరించి, అమ్ముకునే చిరు వ్యాపారులకు లైసెన్సు విధానం లేకపోవడమే కల్తీ సమస్యకు కారణంగా కనిపిస్తోంది. కల్తీ పాలు, కల్తీ పాల ఉత్పత్తులను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని పటిష్ఠం చేయడంతో పాటు యంత్రాంగాన్ని సమన్వయం చేసేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.


ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు నాస్తి

గతంలో ఉన్న ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం పాల ఉత్పత్తుల భద్రత పర్యవేక్షణకు కొంత మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండేవారు. పాలలో కల్తీ పదార్థాల ఉనికిని ఆహార భద్రతా సాధనాలతో పరీక్షించేవారు. లీగల్‌ మెట్రాలజీ యాక్ట్‌ 2009 ప్రకారం తూనికలు, కొలతల శాఖ పాల నాణ్యత సమస్యలను చూసేది. పాల నాణ్యత అంటే వెన్న(ఫ్యాట్‌), పాలల్లో నీటి శాతం అనేది పాల సేకరణ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న పరికరాలతో చూసేవారు. అయితే పాల సేకరణ కేంద్రాలకు లైసెన్సుల జారీ అధికారం ఈ శాఖలకూ లేదు. దీంతో పాల నాణ్యత నిర్ధారణపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పాల సేకరణ కేంద్రాలను స్వాధీనం చేసుకునే అధికారం కూడా లేకుండా పోయింది. దీంతో గత ప్రభుత్వం మిల్క్‌ యాక్ట్‌ తెచ్చింది. సాధారణంగా పాల సేకరణ కేంద్రాలన్నీ ప్రైవేట్‌ డెయిరీల చేతుల్లోనే ఉన్నాయి. ఈ కారణంగా ఫలానా డెయిరీకి పాలు పోయడం, వెన్న ఆధారంగా ధర పొందటం, డెయిరీలిచ్చే బోన్‌సలు, ఇతర సేవలను పొందడం వరకే పాడి రైతుల వంతుగా మారింది. ఒక దశలో వెన్న శాతం తక్కువగా చూపి, పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులు రైతులను మోసం చేయడం కూడా జరుగుతోంది. రైతుల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి పశుసంవర్థకశాఖ, ఫుడ్‌ సేఫ్టీ, లీగల్‌ మెట్రాలజీ శాఖల మధ్య సమన్వయం లేకుండా పోయింది. పశుసంవర్థకశాఖకు సమాంతరంగా పని చేసే పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య కేవలం డెయిరీలపైనే అజమాయిషీ చేస్తోంది. విడి పాల విక్రయాలు, రవాణాపై పర్యవేక్షించడం లేదు. ఇదేమంటే జిల్లాల్లో ఈ సమాఖ్యకు ఏ మాత్రం సిబ్బంది లేరని అంటున్నారు. ఏదైనా అవసరం వస్తే వెటర్నరీ డాక్టర్లతోనే చేయిస్తున్నారు.


జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లకు పాల నాణ్యత తనిఖీ చేసే అధికారం ఉన్నా.. సమస్య వచ్చినప్పుడు మినహా వాళ్లూ పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. రాజమండ్రిలో కల్తీగా భావిస్తున్న పాల నుంచి నమూనాలు సేకరించి, విజయవాడలోని వీబీఆర్‌ఐ, విశాఖపట్నం, హైదరాబాద్‌లోని ల్యాబ్‌లకు పంపుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. కల్తీ పాలుగా గుర్తించినప్పుడు సమీప అధికారులకు ఫిర్యాదు చేయాలని పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు సూచించారు.

Updated Date - Feb 24 , 2026 | 03:29 AM