‘కల్తీపాల కాటు’లో మరో ఇద్దరు మృతి
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:40 AM
కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన అడ్డాల గణేశ్ సరఫరా చేసిన పాలలో...
ఏడుకు చేరిన మృతుల సంఖ్య.. వెంటిలేటర్‌పై 10 మందికి చికిత్స
రాజమహేంద్రవరం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన అడ్డాల గణేశ్ సరఫరా చేసిన పాలలో ఇథలీన్ గైక్లాన్ కలవడంతో 20మంది తీవ్ర అస్వస్థతకు గురై.. ఐదుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అలాగే మరో 15 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా చికిత్స పొందుతున్నవారిలో సోమవారం రాజమహేంద్రవరం లాలాచెరువులోని చౌడేశ్వరనగర్‌కు చెందిన కె.సత్యనారాయణ((76), మంగళవారం అదే ప్రాంతానికి చెందిన జి.సూర్యారావు (81) మృతి చెందారు. మిగిలిన మరో 13 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురికి డయాలసిస్ చేస్తున్నారు. పది మంది వెంటిలేటర్‌పైనే డయాలసిస్ వైద్యం పొందుతున్నారు. వీరిలో రాజేంద్రనగర్‌కు చెందిన పిచ్చుక నాగేశ్వరరావు(70) ఆరోగ్యం మెరుగు పడినట్టు సమాచారం. మరి కొందరు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.