అసెంబ్లీలో ‘కల్తీ నెయ్యి’పై చర్చ!
ABN , Publish Date - Feb 23 , 2026 | 03:57 AM
తిరుమల లడ్డూ తయారీలో కల్తీనెయ్యి వాడకం అంశాన్ని శాసనసభలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
గత ప్రభుత్వ పాపాలను ప్రజలకు వివరించే యోచనలో సర్కారు
ప్రజల దృష్టి మరల్చేందుకు మండలిలో వైసీపీ ఎత్తులు
వాటికి చెక్ పెట్టేలా కల్తీ నెయ్యిపై చర్చకు నిర్ణయం
అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ తయారీలో కల్తీనెయ్యి వాడకం అంశాన్ని శాసనసభలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ అంశాన్ని తెరపైకి తెచ్చి మండలిలో వైసీపీ రాద్దాంతం చేస్తోందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. అక్కడ తమ వాణిని బలంగా వినిపించేందుకు ప్రయత్నిస్తున్నా.. వైసీపీ సభ్యులు బలప్రయోగంతో మండలిని తప్పుదారి పట్టిస్తున్నారని ఎన్డీయే కూటమి సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కల్తీనెయ్యి అంశంలో ప్రజలకు వాస్తవాలను, గత ప్రభుత్వ పాపాలను తెలియజేసేందుకు శాసనసభే సరైన వేదిక అని అధికార కూటమి భావిస్తోంది. ఇప్పటికే బడ్జెట్‌పై చర్చ ముగిసినందున కల్తీ నెయ్యి అంశాన్ని కూడా సభలో చర్చకు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. చెప్పులు, బూట్లు ధరించి శ్రీవారి చిత్రపటాలను పట్టుకుని మండలి వేదికగా వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారిని కించపరిచేలా వ్యవహరించారని, ఇదేమని ప్రశ్నిస్తే పచ్చి అబద్దాలతో ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి అంశాలన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే శాసనసభే సరైన వేదిక అని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా శాసనసభలో చర్చించి తర్వాత అవసరాన్ని బట్టి మండలిలోనూ చర్చించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ వారంలో ఏదో ఒక రోజు కల్తీ నెయ్యి అంశంపై శాసనసభలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.