కల్తీ నెయ్యి ఘోర అపచారం
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:54 AM
‘కల్తీ జరిగిందని తెలిసీ అదే నెయ్యిని పవిత్ర ప్రసాదంలో కొనసాగించడం ఘోర అపచారమే కాకుండా ధర్మానికి విరుద్ధమైన, అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య’
ఇలాంటి వాటికి ఆస్కారమివ్వకండి
సీఎం చంద్రబాబుకు శ్రీవారి ఆలయ పెద్దజీయర్ లేఖ
తిరుమల, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ‘కల్తీ జరిగిందని తెలిసీ అదే నెయ్యిని పవిత్ర ప్రసాదంలో కొనసాగించడం ఘోర అపచారమే కాకుండా ధర్మానికి విరుద్ధమైన, అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య’ అని తిరుమల శ్రీవారి ఆలయ పెద్దజీయర్ స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీనెయ్యి అంశంపై ఆయన స్పందిస్తూ.. సోమవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు ఆరాధించే వేంకటేశ్వరస్వామికి నిత్యం పవిత్ర భావంతో నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకలు. లడ్డూ ప్రసాదాలు తయారు చేసే నెయ్యి కల్తీ అయినట్లు సీబీఐ నిర్ధారించడం మమ్మల్ని తీవ్ర దిగ్ర్భాంతికి, మనోవేదనకు గురిచేసేంది. భక్తులు పవిత్ర హృదయంతో స్వీకరించే లడ్డూప్రసాదానికి సంబంధించి ఇలాంటి అవకతవకలు చోటు చేసుకోవడం సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించే వారి మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. శ్రీవారికి పరమభక్తుడైన మీరు భవిష్యత్‌లో ఇలాంటి అపచారాలకు అవకాశం లేకుండా పటిష్ఠమైన వ్యవస్థను నెలకొల్పుతారని విశ్వసిస్తున్నాం. ధర్మాన్ని పరిరక్షించే శక్తిని, ఆలయాల పవిత్రతను కాపాడే దృఢ సంకల్పాన్ని, మన సంప్రదాయాలను నిలబెట్టే స్ఫూర్తిని వేంకటేశ్వరస్వామి మీకు కల్పించాలి’ అంటూ ఆయన సీఎంకు లేఖ పంపారు.
తిరుపతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన దోషులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి వెంటనే శిక్షించాలని సాధుసంతుల సమన్వయకర్త అట్లూరి నారాయణ రావు డిమాండ్ చేశారు. తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద సోమవారం హిందూ ధార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. స్వామివారి పేరిట 1001 టెంకాయిలు కొట్టి వేడుకున్నారు. ఈ సందర్భంగా అట్లూరి మాట్లాడారు. ‘శ్రీవారి లడ్డూ ఇంట్లో ఉంటే వారం రోజులపాటు పరిమళం తగ్గేది కాదు. అదే లడ్డూ వైసీపీ హయాంలో రుచి చూసిన వారికి స్పష్టంగా అర్థమైవుంటుంది. తిరుమల నుంచి తిరుపతికి వచ్చేసరికే లడ్డూ విరిగిపోయేది. వైసీపీ నేతలు చేసిన తప్పును ఒప్పుకోకుండా బాహుబలి సినిమాలో కాలకేయులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో కుట్రలు, కుతంత్రాలే జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి క్షేత్ర ప్రాబల్యాన్ని తగ్గించడానికి వైసీపీ ప్రభుత్వం పనిచేసింది. వేంటేశ్వర స్వామి భక్తులు, ప్రజలు వైసీపీని స్వచ్ఛందంగా బహిష్కరించాలి. కల్తీ నెయ్యి శ్రీవారి ప్రసాదాలు తయారుచేసి హిందువుల ఆరోగ్యంతో చెలగాటమాడటం దారుణం. ప్రమాదకర రసాయనాలు కలిపిన విషయం సిట్ నివేదికలో బయటపడిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పడం వెనుక పెద్దల కుట్రలు దాగివున్నాయి. వేంకటేశ్వరస్వామికి, భక్తులకు వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలి. వైవీ సుబ్బారెడ్డి పీఏ చినఅప్పన్న అకౌంట్‌లోకి రూ.24 కోట్లు ఎలా వచ్చాయనే విషయమై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
తిరుమల, తిరుపతి క్షేత్రాలతో పాటు టీటీడీపై దుష్ప్రచారం చేసే వారిపై తక్షణమే పీడీ యాక్టు పెట్టి అరెస్టు చేయాలి. కల్తీనెయ్యి వ్యవహారంపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తాం’ అని చెప్పారు. అనంతరం శివకామేశ్వరి పీఠం శివానంద స్వామి, తుమ్మ ఓంకార్, రాజేశ్వరానంద స్వామి, కాలబైరవస్వామి మాట్లాడారు. ‘గత ప్రభుత్వానికి మానం, అభిమానం ఉంటే చేసిన తప్పును భేషరతుగా ఒప్పుకోవాలి. వైసీపీ నేతలు కల్తీచేసి కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. టీటీడీ మాజీ చైౖర్మన్ వైవీ సుబ్బారెడ్డి తొలుత కల్తీ జరగలేదన్నాడు. తాజాగా కల్తీ జరిగిందని ఒప్పుకొన్నాడు. ఆయన పీఏ అప్పన్న గత ప్రభుత్వంలో తిరుమలలో చక్రం తిప్పాడు. లడ్డూల ద్వారా రూ.250కోట్లు కమీషన్ల రూపంలో లావాదేవీలు జరిగాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో అంజలి మాత, ఓంశ్రీ మాత తదితరులు పాల్గొన్నారు.
