బేరసారాలన్నీ ఢిల్లీలోనే
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:45 AM
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన వ్యవహారంలో దేశ రాజధాని ఢిల్లీ అడ్డాగా...అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న బేరసారాలు సాగించారని సీబీఐ సిట్ గుర్తించింది.
‘కల్తీ నెయ్యి’లో రోజుకో కొత్త కోణం
వైవీ పీఏ చిన్నప్పన్నను అక్కడే కలిసిన ప్రీమియర్ డెయిరీ ఎండీ గుప్తా
కిలోకు రూ.7 కమీషన్ ఇచ్చేలా డీల్
పొమిల్ జైన్‌తోనూ ఢిల్లీలోనే భేటీ
కిలోకు రూ.25 ఇవ్వాలని డిమాండ్
దీనిపై జైన్ ఫిర్యాదు చేసినా వైవీ మౌనం
గుప్తాను కలిసిన ‘ఎంపీ నివాస్’ ఎవరిది
ఎవరి అండతో చిన్నప్పన్న జోక్యం?
ఆ దిశగా దృష్టి సారించని ‘సిట్’
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన వ్యవహారంలో దేశ రాజధాని ఢిల్లీ అడ్డాగా...అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న బేరసారాలు సాగించారని సీబీఐ సిట్ గుర్తించింది. ప్రీమియర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ జగ్‌మోహన్ గుప్తా ఢిల్లీ ఎంపీ నివా్‌సలోని ఒకరి ఫ్లాట్‌లో చిన్నప్పన్నను కలిశారు. టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇప్పిస్తే తనకు కమీషన్ ఇవ్వాలని అక్కడే చిన్నప్పన్న బేరసారాలు సాగించారు. ఒప్పందం కుదిరాక కమీషన్‌కు సంబంధించిన నగదు సైతం చిన్నప్పన్నకు ఢిల్లీలోనే ముట్టింది. అంతకుముందు భోలేబాబా డెయిరీ ప్రతినిధులు కూడా చిన్నప్పన్నను ఢిల్లీలోనే కలవడం గమనార్హం. ఎలా చూసినా చిన్నప్పన్న ఢిల్లీ నుంచే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టుల వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్టు సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సీబీఐ సిట్ గుర్తించింది. ఇంతకూ ప్రీమియర్ డెయిరీ యజమాని ఢిల్లీలో చిన్నప్పన్నను కలిసిన ఎంపీ నివాస్ ఎవరిది? ఎవరి అండా లేకుండా చిన్నప్పన్న టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎలా సాధ్యం? అన్న ప్రశ్నలు కీలకంగా మారాయి. నెయ్యి నాణ్యతపై ఫిర్యాదు వచ్చిందని, విచారించాలని ప్రొక్యూర్‌మెంట్ జీఎంను ఆదేశించిన అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆ తర్వాత, మిన్నకుండిపోవడం, తన పీఏ చిన్నప్పన్న కిలోకు రూ. 25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ భోలేబాబా డెయిరీ యజమాని నేరుగా ఫిర్యాదు చేసినా వైవీ సుబ్బారెడ్డి స్పందించకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ అంశాలపై సిట్ దృష్టి సారించకపోవడం ప్రశ్నార్థకంగా మారుతోంది.
8.57 లక్షల కిలోల నెయ్యి - రూ.50 లక్షల కమీషన్
టీటీడీ నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచిన సందర్భంలో 2022 మే నెలలో, ఆ టెండరు కోసం ప్రయత్నిస్తున్న ప్రీమియర్ డెయిరీ ఎండీ గుప్తాకు అప్పటి సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న నుంచి ఫోన్ కాల్ వెళ్లింది. నెయ్యి సరఫరా టెండర్ల గురించి చర్చించడానికి తనను ఢిల్లీలో కలవాలని చెప్పారు. దీంతో గుప్తా న్యూఢిల్లీలోని నార్త్ ఎవెన్యూ ఎంపీ నివా్‌సలో చిన్నప్పన్నను కలిశారు. నెయ్యి సరఫరా టెండర్లు ఖరారు చేయిస్తే తనకు కిలోకు రూ.7 కమీషన్ ఇవ్వాలని చిన్నప్పన్న డిమాండ్ చేశారు. చిన్నప్పన్న ఒత్తిడికి తోడు టీటీడీతో తమ వ్యాపారం సజావుగా నడవడానికి చిన్నప్పన్న డిమాండ్ చేసిన మేరకు కమీషన్ ఇవ్వడానికి జగ్‌మోహన్ అంగీకరించారు. దీంతో ప్రీమియర్ డెయిరీకే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కింది. టీటీడీకి 2022, 2023 ల్లో 8.57 లక్షల కిలోల నెయ్యి గుప్తా సరఫరా చేశారు. చిన్నప్పన్నకు కమీషన్ మొత్తాన్ని ఢిల్లీలోనే చెల్లించారు. ఈ కమీషన్ నగదు కోసం జగ్‌మోహన్‌కు చిన్నప్పన్న అనేకసార్లు కాల్స్ చేసినట్టు సిట్ గుర్తించింది. వాట్సాప్ కాల్స్‌తో పాటు సాధారణ కాల్స్ చేసినట్టు నిర్ధారించుకుంది. చిన్నప్పన్నకు కమీషన్ నగదు అందజేయడానికి జగ్‌మోహన్ తన డెయిరీలో పనిచేసే ఉద్యోగులు అమన్ గుప్తా, విజయ్ గుప్తాలను అప్పట్లో ఢిల్లీలోనే ఉంచారు. వారిద్దరూ అక్కడే మకాం వేసి పలు దఫాలుగా రూ. 50 లక్షలు చిన్నప్పన్నకు అందజేశారు.