MBBS Admissions: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:46 AM
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్ ప్రవేశాలకు వీలుకలగనుంది.
100 ఎంబీబీఎస్ సీట్లకు ప్రవేశాలు
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్ ప్రవేశాలకు వీలుకలగనుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం(సీఎస్ఎస్) కింద ఈ కళాశాలకు రూ.195 కోట్ల సాయం అందింది. తొలిదశలో ఈ కాలేజీలో 100 మంది వైద్య విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం అంగీకారం తెలిపారు. జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) తాజా నిబంధనల మేరకు 100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న కళాశాలలో 420 పడకలతో బోధనాసుపత్రిని ఏర్పాటు చేయాలి. అయితే, గత వైసీపీ ప్రభుత్వం ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 330 పడకల సామర్థ్యం గల జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు అనుమతించింది. కానీ, మారిన ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు 420 పడకల ఆసుపత్రి అవసరం. ఈ నేపథ్యంలో ఈ దిశగా ఆసుపత్రిని విస్తరించేందుకు కూడా సీఎం అనుమతించారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పిడుగురాళ్ల వైద్య కళాశాలకు 237 మంది వైద్యులు, ఇతర సిబ్బందితో పాటు బోధనాసుపత్రికి 600 మంది సిబ్బందిని సమకూర్చేందుకు కూడా సీఎం అంగీకరించారని చెప్పారు.