ఈ ఏడాది నుంచే పిడుగురాళ్ల కాలేజీలో అడ్మిషన్లు
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:32 AM
పిడుగురాళ్లలో నూతనంగా నిర్మించిన బోధనాస్పత్రిలో 2026-27 విద్యా సంవత్సరం నుంచే 100 ఎంబీబీఎస్ సీట్లకు ప్రవేశాలు చేపట్టేందుకు ..
పిడుగురాళ్ల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పిడుగురాళ్లలో నూతనంగా నిర్మించిన బోధనాస్పత్రిలో 2026-27 విద్యా సంవత్సరం నుంచే 100 ఎంబీబీఎస్ సీట్లకు ప్రవేశాలు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ సమీపంలోని మెడికల్ కళాశాలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహించి నెలాఖరు నాటికి పనులు పూర్తిచేస్తామని తెలిపారు. వైద్య కళాశాల ప్రారంభానికి సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో చర్చించి తేదీని ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఇది పల్నాడులో అతిపెద్ద ప్రాజెక్టు అని, అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆస్పత్రిలో క్యాంటీన్, మరికొన్ని పనులకు ఆన్‌లైన్ టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, డీఎంహెచ్‌వోలు రవి, పద్మావతి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.