Share News

కూటమిలో ఇబ్బంది పెడుతున్నారు!

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:29 AM

పాలక కూటమిలో కొందరు తనను అంతర్గతంగా ఇబ్బంది పెడుతున్నారని.. ఇదే కొనసాగితే కొద్దిరోజులు చూసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

కూటమిలో ఇబ్బంది పెడుతున్నారు!

  • కొద్దిరోజులు చూస్తా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

  • మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

జమ్మలమడుగు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పాలక కూటమిలో కొందరు తనను అంతర్గతంగా ఇబ్బంది పెడుతున్నారని.. ఇదే కొనసాగితే కొద్దిరోజులు చూసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జమ్మలమడుగులో బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తానంటే పార్టీ లెక్కలోకి తీసుకోకపోతే రాజీనామాకు కూడా వెనుకాడనని చెప్పారు. జిల్లాలో బీజేపీ ఇంకా బలపడాల్సి ఉందన్నారు. నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని, ప్రజలకు మంచి చేయకపోతే పార్టీ బలపడదని చెప్పారు. గండికోట ప్రాజె క్టు నుంచి అన్ని ప్రాంతాలకు నీరు వెళ్తోందని.. అయితే ముంపు ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని.. ఈ పదవుల కంటే తనకు ప్రజ లే ముఖ్యమని తెలిపారు. వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడుతూ.. ‘పంచభూతాలు కూడా నేను చెబితేనే రావాలని చెప్పగలిగే పెద్ద దెయ్యం జగన్‌. నేను వైసీపీలో ఉన్నప్పుడు ఏరోజూ ఆయన్ను సార్‌ అని పిలువలేదు. నేను ఆ పార్టీ వీడాక నాపై ఒక్క రేప్‌ కేసు తప్ప మిగిలిన అన్ని కేసులూ పెట్టించాడు’ అని ధ్వజమెత్తారు. సమావేశంలో బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 04:30 AM