Share News

నందిపై ఆది దంపతుల విహారం

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:44 PM

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

   నందిపై ఆది దంపతుల విహారం
:ఆలయ ప్రధాన గోపురం వద్ద స్వామిఅమ్మవార్లు

మహా సరస్వతిగా భ్రమరాంబదేవి

కన్నుల పండువగా గ్రామోత్సవం

నేడు నేడు పంచాగ శ్రవణం, రథోత్సవం

శ్రీశైలం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు బుధవారం ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునుడి ఉత్సమూర్తులను నందివాహనంపై ఆశీనులజేసి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, చెంచు నృత్యాలు, కళారూపాలు ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు: ఆలయ దక్షిణ మాడవీధిలోని కళారాధన వేదికపై శ్రీశైల జగద్గురుసేవా సమితిట్రస్ట్‌ వారిచే ధార్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు, శివనామ భజనలు జరిపించారు. పుష్కరిణి, శివదీక్ష శిభిరాలు, యాంపీ థియేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన కన్నడ భక్తరంజనీ, కన్నడ భక్తసంగీత విభావరి, శ్రీశైల వైభవంపై ప్రవచన కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

నేడు రథోత్సవం : ఉగాది ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం ఉదయం శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం, సాయంత్రం స్వామిఅమ్మవార్లకు రథోత్సవం ఉంటుంది. భ్రమరాంబదేవి రమావాణీసేవిత రాజరాజేశ్వరి అలంకరణలో ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తారని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

నేత్రపర్వంగా ప్రభోత్సవం

శ్రీగిరిపై ఉగాది వేడుకల్లో వేలాదిగా భక్తులు

శ్రీశైలం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజైన బుధవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ప్రభోత్సవం వేలాది మంది భక్తుల మధ్య కన్నులపండువగా జరిగింది. డప్పు చప్పుళ్లు, మేళతాళాలు కళాకారుల విన్యాసాలతో కదిలిన ప్రభ నంది ఆలయం వరకు తిరిగి వచ్చింది. భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.

Updated Date - Mar 18 , 2026 | 11:44 PM