అద్దేపల్లి బ్రదర్స్‌కు బెయిల్
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:35 AM
నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావు సోదరులు, బాలాజీలకు విజయవాడ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
మరో ప్రధాన నిందితుడు బాలాజీకి కూడా..
నకిలీ మద్యం కేసులో బెజవాడ కోర్టు ఉత్తర్వులు
మరో కేసులో ‘బెయిల్’ పెండింగ్‌తో ఆ ముగ్గురూ ప్రస్తుతానికి జైలులోనే..
విజయవాడ, ములకలచెరువు, జనవరి 29(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావు సోదరులు, బాలాజీలకు విజయవాడ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. విజయవాడలోని ఇబ్రహీంపట్నం, తంబళ్లపల్లెలోని ములకలచెరువులో కేంద్రాలను ఏర్పాటు చేసి అద్దేపల్లి బ్రదర్స్ నకిలీ మద్యాన్ని తయారు చేసిన విషయం తెలిసిందే. విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో నిందితులు దాఖలుచేసిన బెయిల్ పిటిషన్లపై వాద ప్రతివాదనలు ముగియడంతో కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. అద్దేపల్లి బ్రదర్స్ రూ.50 వేలు చొప్పున, బాలాజీ రూ.25 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలంటూ షరతు విధించింది. కేసును ప్రభావితం చేసేలా సాక్షులు, ఇతర నిందితులను కలవరాదని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. కాగా, మరో నిందితుడు తలారి రంగయ్య పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా, ములకలచెరువు కేసులో బెయిల్ పిటిషన్లు మదనపల్లె కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో.. బెయిల్ దొరికిన వారు సైతం జైలుకే పరిమితం కావాల్సి ఉంటుంది.
అంతా జనార్దన్‌రావే చేశాడు
విచారణలో రాజేశ్, అన్బురసు వెల్లడి!
‘అంతా జనార్దన్‌రావే చేశాడు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించేందుకు నకిలీ మద్యం తయారు చేసేందుకు పథకం పన్నారు. ఎవరు చెబితే చేశారో తెలియదు గానీ ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. మూడు నెలల పాటు నకిలీ మద్యం విక్రయించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అన్ని బెల్ట్‌షాపులకు రవాణా చేశారు. జనార్దన్‌రావు(ఏ1), ఆయన అనుచరుడు కట్టా రాజు(ఏ2) నకిలీ మద్యం తయారీ కేంద్రానికి ఇన్‌చార్జిగా ఉంటూ లావాదేవీలన్నీ చూసుకున్నారు’ అని ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో కీలక నిందితులు రాజేశ్, అన్బురుసు వెల్లడించినట్లు తెలిసింది. మదనపల్లె సబ్‌జైలులో ఉన్న వీరిద్దరిని గురు, శుక్రవారాల్లో కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లె కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో గురువారం మదనపల్లె ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి విచారించారు.