తొలి అడుగు పడింది
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:48 AM
ప్రకాశం జిల్లా అద్దంకిలోని 3,4 వార్డుల్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి అడుగు పడింది. అద్దంకిలో రెండు రోజుల కిందట ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా...
అద్దంకిలో.. కాలువ నిర్వాసితుల కాలనీలో మంత్రి పర్యటన
సమస్యల పరిష్కారంపై అధికారులకు ఆదేశాలు
వెంటనే విద్యుత్ దీపాల ఏర్పాటు
‘అక్షరం అండగా...’ కార్యక్రమానికి స్పందన
అద్దంకి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా అద్దంకిలోని 3,4 వార్డుల్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి అడుగు పడింది. అద్దంకిలో రెండు రోజుల కిందట ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని నిర్వహించగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో 3,4,5 వార్డుల పరిధిలోని కాలువ కట్టపై నివసించి, ఇప్పుడు మినీ బైపాస్ రోడ్డు నిర్మాణంతో శింగరకొండపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కాలనీకి తరలిన మహిళలు అక్కడి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన నిర్వాసితుల కాలనీలో పర్యటించి, మహిళలతో మాట్లాడారు. ‘ఆంధ్రజ్యోతి’ చర్చావేదికలో చెప్పిన సమస్యలనే మహిళలు మరోసారి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. మిగిలినవారు కూడా ఫౌండేషన్ వేసుకుంటే తొలి విడత బిల్లు చెల్లిస్తామన్నారు. శ్మశానానికి స్థలం కేటాయించే వరకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో మహాప్రస్థానం వాహనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీకి గుండ్లకమ్మ నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్ రవీంద్ర, ఏఈ లోకేశ్‌లను మంత్రి ఆదేశించారు. వీధిలైట్లు లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు చెప్పిన నేపథ్యంలో శనివారం వాటిని ఏర్పాటు చేశారు. ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ నిర్వహించిన అనంతరం రెండో రోజే మంత్రి రవికుమార్ కాలనీకి రావడం, సమస్యలపై సానుకూలంగా స్పందించడంపై ప్రజలు అనందం వ్యక్తం చేశారు.