రెవెన్యూ కనికట్టు
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:35 AM
రెవెన్యూశాఖ తలుచుకుంటే సామాన్యుల జీవితాలు గల్లంతవుతాయి. ఒక్క కాగితం, ఒక్క సంతకంతో భూములు, వాటితో ముడిపడిన జీవితాలు మారిపోతాయి. అయినా సరే ఆ శాఖకు పట్టింపు ఉండదు.
తప్పు చేసిన వారిని కాపాడేందుకు ఎత్తు
అడవివరం దేవదాయ భూములు పరాధీనం
300 కోట్ల విలువైన 20 ఎకరాలు ప్రైవేట్‌కు కూటమి రాగానే బాధ్యులుగా ముగ్గురి గుర్తింపు
3 ఇంక్రిమెంట్ల కోతతో తిరిగి విధుల్లోకి..
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రెవెన్యూశాఖ తలుచుకుంటే సామాన్యుల జీవితాలు గల్లంతవుతాయి. ఒక్క కాగితం, ఒక్క సంతకంతో భూములు, వాటితో ముడిపడిన జీవితాలు మారిపోతాయి. అయినా సరే ఆ శాఖకు పట్టింపు ఉండదు. అడ్డమైన తప్పులు చేసిన అధికారులపై కఠిన చర్యల విషయంలోనూ వెనుకడుగే. పెద్ద తప్పులను కూడా చిన్నవి చేసి చూడాలంటూ అవినీతి అధికారులను కాపాడుతోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అడవివరం దేవదాయ భూముల కేసు. ఆ వివరాల్లోకి వెళితే.. గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా భూముల రీ సర్వే నిర్వహించారు. 2023 ఆగస్టులో ఈ ప్రక్రియ జరిగే నాటికి ఉమ్మడి విశాఖ జిల్లా అడవి వరంలో 20 ఎకరాల దేవాదాయ భూమి ఉంది. దాని కనీస విలువే 300 కోట్లు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అలాంటి భూమిని కుట్రపన్ని నాడు ప్రైవేటు ఖాతాలో వేశారు. దేవదాయ శాఖకు చెందిన 20 ఎకరాల భూమిని అత్యంత కుట్రపూరితంగా ప్రైవేటు ఖాతాలో వేశారు. అప్పట్లోనే ఇది వివాదాస్పదమైంది. కూటమి ప్రభుత్వంలో దీనిపై ఫిర్యాదులు వచ్చాయి. అడవి వరంలోని దేవదాయభూమిని పరాధీనం చేశారని, ఇందులో ముగ్గురు ఉన్నతాధికారుల పాత్ర ఉందని సర్వే కమిషనర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులోని అంశాలు వాస్తవాలేనని విచారణలో తేలింది.
అయితే, నాడున్న జిల్లా స్థాయి సర్వే అధికారి ప్రోద్భలంతోనే ఈ తప్పులు జరిగాయని తేల్చారు. ఇందుకు ఆ డీడీకి మూడు ఇంక్రిమెంట్లు కోతపెడుతూ సర్వే కమిషనర్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత రీ సర్వేలో క్రియాశీలక పాత్ర పోషించిన ఇద్దరు మండల సర్వేయర్ల( గోపాలపట్నం, విశాఖ రూరల్)ను తప్పనిసరి పదవీవిరమణ శిక్షను విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంటే, ఆ సర్వేయర్లు ఇద్దరూ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. తప్పనిసరి రిటైర్మెంట్ ఆదేశాలను సీసీఎల్‌ఏ కార్యాలయం ఆమోదించడంతో ఆ సర్వేయర్లు ఇద్దరూ ప్రభుత్వ స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి కోర్టులో అప్పీల్ చేశారు. అయినా సరే, ఈ తప్పును చిన్నదిగా చూసి, తప్పనిసరి రిటైర్మెంట్ శిక్షను రద్దుచేస్తూ రెవెన్యూ మంత్రి కోర్టు గత నెల 3వ తేదీన ఆదేశాలు ఇచ్చింది. ఆ ఇద్దరు సర్వేయర్లకు మూడు ఇంక్రిమెంట్ల కోత విధించాలని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఇద్దరు సర్వేయర్లపై విధించిన తప్పనిసరి రిటైర్మెంట్‌ను రద్దుచేస్తూ, వారిని సర్వీసులోకితీసుకొని మూడు ఇంక్రిమెంట్లు కోత విధించాలని ఆదేశిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గురువారం రెండు ఉత్తర్వులు(జీవోలు 1141, 1142) జారీ చేశారు. ఈ ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని ఆ ఇద్దరు సర్వేయర్లను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని ప్రభుత్వం సర్వేకమిషనర్‌ను ఆదేశించింది. రెవెన్యూశాఖ తీసుకున్న తాజా చర్యలు చర్చనీయాంశంగా మారాయి.