Share News

స్టీల్‌ప్లాంటు భూముల్లో ‘అదానీ ప్లాంట్‌’

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:14 AM

విశాఖపట్నంలో అదానీ సంస్థ వివిధ వ్యాపారాల పేరుతో వందలాది ఎకరాలను చేజిక్కించుకుంటోంది. వైసీపీ హయాంలో గంగవరం పోర్టును దక్కించుకున్న ఆ సంస్థ.. ఆ పోర్టును విశాఖ మేజర్‌ పోర్టు కంటే పెద్దదిగా మార్చడానికి కొత్త ఎత్తువేసింది.

స్టీల్‌ప్లాంటు భూముల్లో ‘అదానీ ప్లాంట్‌’

  • గంగవరం పోర్టు విస్తరణకు వ్యూహాత్మకంగా పావులు.. 1,167 ఎకరాల భూముల కోసం సీన్‌లోకి ఎన్‌ఎండీసీ

  • పెల్లెట్‌ ప్లాంట్‌ పెట్టడానికి లీజుకు భూములు.. రెండేళ్లు గడిచినా ఆ ప్లాంట్‌ ఊసెత్తని ఎన్‌ఎండీసీ

  • ఆ భూముల్లో ఇప్పుడు అదానీ ఐరన్‌ ఓర్‌ బ్లెండింగ్‌ ప్లాంట్‌.. ఎన్‌ఎండీసీ, బ్రెజిల్‌ కంపెనీతో ఎంఓయూ

  • దొడ్డిదారిన భూములు తీసుకున్నారని స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగ వర్గాల విమర్శలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో అదానీ సంస్థ వివిధ వ్యాపారాల పేరుతో వందలాది ఎకరాలను చేజిక్కించుకుంటోంది. వైసీపీ హయాంలో గంగవరం పోర్టును దక్కించుకున్న ఆ సంస్థ.. ఆ పోర్టును విశాఖ మేజర్‌ పోర్టు కంటే పెద్దదిగా మార్చడానికి కొత్త ఎత్తువేసింది. దీనిలో భాగంగా గంగవరం పోర్టును ఆనుకుని ఉన్న స్టీల్‌ప్లాంట్‌ భూములపై కన్నేసింది. స్టీల్‌ప్లాంటును ఆనుకొని ఉన్న 400 ఎకరాల్లో సిమెంట్‌ ఫ్యాక్టరీ పెడతామంటూ గతంలో ప్రకటించింది. ఆ కాలుష్యాన్ని భరించలేమంటూ స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కితగ్గింది. ఇప్పుడు స్టీల్‌ప్లాంటుకు చెందిన 1,167 ఎకరాలను తన ఎగుమతి వ్యాపారానికి ఉపయోగించుకోవడానికి పావులు కదిపింది. వ్యాపార విస్తరణకు స్టీల్‌ ప్లాంటు భూములను నేరుగా అడిగితే అంగీకరించరని ‘నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ (ఎన్‌ఎండీసీ)ను తెర మీదకు తెచ్చింది. విశాఖ ఉక్కు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయం (2023)లో నిధులు ఇస్తామని, తాము ఏర్పాటు చేసే ప్లాంటుకు భూములు ఇవ్వాలని ఎన్‌ఎండీసీ కోరింది. కేంద్ర ప్రభుత్వం అదానీకి ఎలాగూ సానుకూలమే కాబట్టి ఆ ప్రతిపాదనకు స్టీల్‌ప్లాంటును ఒప్పించారు. గంగవరం పోర్టుకు, స్టీల్‌ ప్లాంటుకు మధ్యనున్న 1,167 ఎకరాలను ‘పెల్లెట్‌ ప్లాంటు’ ఏర్పాటు నిమిత్తం ఎన్‌ఎండీసీకి 33 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా స్టీల్‌ ప్లాంటుకు ఎన్‌ఎండీసీ రూ. 1,592 కోట్ల ఆర్థిక సాయం చేసింది. ఏడాదికి సుమారు రూ.70 కోట్లు లీజుగా ఇవ్వడానికి ఒప్పుకొంది. ఈ ఎంఓయూ 2023 చివరిలో జరిగింది. ఇప్పటివరకూ ఎన్‌ఎండీసీ పెల్లెట్‌ ప్లాంటు ఏర్పాటు చేయలేదు.


ఎన్‌ఎండీసీకి లీజు.. అదానీ ప్లాంటు..

ఎన్‌ఎండీసీకి స్టీల్‌ ప్లాంటు ఇచ్చిన భూమిని తాము ఉపయోగించుకొని, అందులో ఐరన్‌ఓర్‌ బ్లెండింగ్‌ ప్లాంటు పెడతామని అదానీ గంగవరం పోర్టు తాజాగా ప్రకటించింది. ఎన్‌ఎండీసీ గనుల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఐరన్‌ఓర్‌ తీసుకువచ్చి, ఇక్కడి నుంచి విదేశాలకు భారీ నౌకల ద్వారా ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఇందుకోసం బ్రెజిల్‌కు చెందిన వేల్‌ ఎస్‌.ఎ. కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించింది. ఎన్‌ఎండీసీ, వేల్‌ ఎస్‌.ఎ.తో కలిసి విశాఖను అతి పెద్ద ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. గంగవరం పోర్టు ప్రస్తుతం ఏడాదికి 60 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేస్తోందని, ఈ ఒప్పందం అమలైతే 75 మిలియన్‌ టన్నులకు పెరుగుతుందని పేర్కొంది. అయితే అసలు లక్ష్యం వేరుగా ఉందని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగ వర్గాలు ఆరోపిస ్తున్నాయి. గంగవరం పోర్టును 2030 నాటికి 200 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి విస్తరించాలని అదానీ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి భూములు కావాలి. అవి విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు వద్దనే ఉన్నాయి. నేరుగా అడిగితే ఇవ్వరని, ఇలా దొడ్డిదారిన కొట్టేసిందని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి.


పొంచిఉన్న కాలుష్య ముప్పు

విశాఖపట్నం మేజరు పోర్టు ఏడాదికి 80 మిలియన్‌ టన్నులకు పైగా సరకు రవాణా చేస్తోంది. ఇందులో బొగ్గు, ఐరన్‌ఓర్‌ అధికం. వీటి నుంచి వచ్చే ధూళితో కాలుష్యంలో విశాఖపట్నం ఇటీవల ఢిల్లీని మించిపోయింది. ఆ కాలుష్యాన్ని ఎలా తగ్గించాలా?.. అని రాష్ట్ర ప్రభుత్వం కింద మీద పడుతోంది. ఇప్పుడు గంగవరం పోర్టుకు ఐరన్‌ఓర్‌ డస్ట్‌ తెప్పించి, దానిని ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తే ఆ కాలుష్యం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. సమీపంలోని గాజువాక ప్రజలంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి పరిశ్రమలు పెట్టేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. అలాంటి అడ్డంకులు లేకుండా జాయింట్‌ వెంచర్‌ అని, స్టీల్‌ ప్లాంటు కోసమేనని అదానీ సంస్థ చెబుతోంది.

పెల్లెట్‌ ప్లాంటు అంటే...?

గనుల్లో ముడి ఇనుమును తరలించగా కింద పొడి మిగులుతుంది. దానిని చిన్న చిన్న గోళీలుగా తయారుచేస్తారు. వాటినే పెల్లెట్లు అని పిలుస్తారు. ఆ పెల్లట్లను స్టీల్‌ ప్లాంట్లలోని బ్లాస్ట్‌ ఫర్నేసుల్లో ఉపయోగిస్తారు. ఎన్‌ఎండీసీకి ఛత్తీస్‌గఢ్‌లో ఇనప ఖనిజ గనులు ఉన్నాయి. అక్కడి నుంచి రద్దును ఇక్కడకు తెచ్చి పెల్లెట్లు తయారు చేస్తామని, వాటిని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుతో పాటు పక్కనే నక్కపల్లిలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌ పెట్టబోయే ప్లాంటుకు కూడా సరఫరా చేస్తామని అప్పట్లో ఎన్‌ఎండీసీ ప్రకటించింది. ఇది విశాఖ స్టీల్‌ప్లాంటుకు ఉపయోగపడుతుందని అప్పుడు ఎవరూ వ్యతిరేకించలేదు.

Updated Date - Mar 21 , 2026 | 05:15 AM