సోనాబోట్ల చొరబాటును అడ్డుకుంటాం
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:11 AM
చెన్నైకి చెందిన సోనాబోట్ల అక్రమ చొరబాటును అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.
మత్స్యకారుల సమస్యలపై ఇద్దరు మంత్రులతో కమిటీ: మంత్రి డోలా
సింగరాయకొండ/నెల్లూరు(హరనాథపురం)/కావలి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): చెన్నైకి చెందిన సోనాబోట్ల అక్రమ చొరబాటును అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కడలూరుకు చెందిన బోట్లు కొన్నేళ్లుగా నిబంధనలను ఉల్లఘించి రాష్ట్ర తీరంలోకి చొరబడి మత్స్యసంపదను కొల్లగొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుతో సీఎం చంద్రబాబు కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. సోనాబోట్లను నియంత్రించేందుకు నాలుగు మెకనైజ్డ్ బోట్లు వెంటనే కొనుగోలు చేయడానికి ఆదేశించినట్లు వెల్లడించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై వైసీపీ నీచ రాజకీయాలకు తెరతీయడం సిగ్గుమాలిన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్బర్ నిర్మాణం ద్వారా 25వేల మత్స్యకార కుటుంబాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అభివృద్ధిని, పెట్టుబడులను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమని మంత్రి మండిపడ్డారు.
తమిళనాడు బోట్లను దీటుగా ఎదుర్కొంటాం: మంత్రి కొల్లు
తమిళనాడు బోట్లను దీటుగా ఎదుర్కొనేందుకు సముద్రంలో గస్తీ కోసం 650 హార్స్ పవర్ కలిగిన నాలుగు బోట్లు కొనాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే 3 బోట్లు సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయని, మరో బోటును ఆదివారం నుంచి తిరుపతిలో అందుబాటులో ఉంచామని తెలిపారు. కాగా, జువ్వలదిన్నె హార్బర్‌ను మెరైన్ ఐజీ గోపీనాథ్ జెట్టి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జువ్వలదిన్నెలో ఇటీవల జరిగిన ఘటనలను మెరైన్ డీఎస్పీ బాలిరెడ్డి వివరించారు. అనంతరం ఆయన తమిళనాడు బోట్ల వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులను విచారించారు.

జగన్ ఓ కామెడీ పీస్: మంత్రి కొల్లు
తిరుపతి కలెక్టరేట్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): మావిగన్ వ్యాఖ్యలతో జగన్ ఒక కామెడీ పీస్‌గా తయారయ్యాడని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఆదివారం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ.. కులాల పేరుతో అధికారులను బెదిరించే నీచమైన సంస్కృతికి పేర్ని నానీ తెరదీశాడని, ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదన్నారు.