12 మంది ఇంజనీర్లపై వేటు
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:02 AM
న్యూ డెవల్‌పమెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) నిధులతో చేపట్టిన రహదారి పనుల్లో గోల్‌మాల్ జరిగిందని విజిలెన్స్ నిర్ధారించింది.
విజిలెన్స్ నివేదిక మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): న్యూ డెవల్‌పమెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) నిధులతో చేపట్టిన రహదారి పనుల్లో గోల్‌మాల్ జరిగిందని విజిలెన్స్ నిర్ధారించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో జరిగిన 9 రహదారుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమగ్ర విచారణ చేసిన తర్వాత 12 మంది రోడ్లు-భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు(జీఓ-8) జారీ చేశారు. ఎన్‌డీబీ నిధులతో రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టు(ఏపీఆర్‌బీఆర్‌పీ), మండల, గ్రామీణ అనుసంధాన పురోగతి ప్రాజెక్టు(ఏపీఎమ్‌సీఆర్‌సీఐపీ) ప్రాజెక్టుల కింద చిత్తూరు జిల్లాల్లో రహదారుల ప నులు చేపట్టారు. అయితే కొన్నింటిపై ఫిర్యాదులు రాగా వాటిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణ చేపట్టి గతేడాది అక్టోబరు 7న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దేవదొడ్డి-లంకనపల్లి రహదారి విస్తరణ, పూతలపట్టు-ఐరాల వయా కొం డేపల్లి, పూతలపట్టు-రామాపురం వయా కొండేపల్లి, చౌడేపల్లి-వలసపల్లి వయా బోయకొండ, నాగలాపురం-చిన్నపండూరు, సూళ్లూరుపేట-సంతవేలూ రు, దామలచెర్వు-నెండ్రగుంట, శ్రీకాళహస్తి-మసాలపాడు పనులలో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ నిర్ధారించింది.