Share News

మంట పుట్టిస్తున్న అగ్గి పురుగు

ABN , Publish Date - Jun 28 , 2026 | 05:02 AM

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో అగ్గి పురుగు(యాసిడ్‌ పురుగు) ప్రజలను వణికిస్తోంది. దీని శాస్త్రీయ నామం ఫెడరస్‌ ఫస్ట్‌ పీస్‌. ఏడు నుంచి పది మిల్లీ మీటర్ల పొడవుండి..

మంట పుట్టిస్తున్న అగ్గి పురుగు

  • శరీరంపై పాకినప్పుడు నలిపితే... విషం విడుదల

  • బొబ్బలు వచ్చి శరీరంపై పుండ్లు

  • తాడేపల్లిగూడెంలో జనం గగ్గోలు

తాడేపల్లిగూడెం రూరల్‌, మే జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో అగ్గి పురుగు(యాసిడ్‌ పురుగు) ప్రజలను వణికిస్తోంది. దీని శాస్త్రీయ నామం ఫెడరస్‌ ఫస్ట్‌ పీస్‌. ఏడు నుంచి పది మిల్లీ మీటర్ల పొడవుండి.. నలుపు, నారింజ రంగుల చారలతో వుండే ఈ పురుగులు ఇప్పుడు జనాలని కలవరపెడుతున్నాయి. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం, కొండ్రుప్రోలు తదితర గ్రామాల్లో ఈ యాసిడ్‌ పురుగులు జనంపై దాడి చేస్తున్నాయి. ఇవి స్వయంగా కుట్టకపోయినప్పటికీ శరీరంపై వాలినప్పుడు నలిపితే... పురుగు శరీరంలోని టాక్సిక్‌ ద్రవం(విష రసాయనం) చర్మానికి అంటుకుని మంట, ఎర్రటి దద్దుర్లు, నీటి బొబ్బలు వస్తున్నాయి. ఆ తర్వాత చర్మం పొరలు ఊడి ఎర్రగా పుండ్లు పడుతున్నాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ పురుగుల బాధితులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి రోజూ పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

ఎలర్జీ సోకితే ఆసుపత్రికి రండి

ఈ పురుగు చర్మంపై వాలితే ఎట్టి పరిస్థితిల్లోనూ దాన్ని నలపకూడదు. నలిపితే వెంటనే సబ్బుతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. నలిపిన చేతులతో కళ్లను తాకకూడదు. ఎలర్జీ నివారణకు ఆరోగ్య కేంద్రాల వద్ద లోషన్‌ ఇస్తారు. అవసరమైతే వైద్య శిబిరాలు నిర్వహించాలని ఇప్పటికే వైద్యులకు సూచనలు ఇచ్చాం.

- డాక్టర్‌ గీతాభాయి, డీఎంహెచ్‌వో, పశ్చిమగోదావరి

Updated Date - Jun 28 , 2026 | 05:02 AM