Share News

నన్ను బండబూతులు తిట్టారు!

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:06 AM

విశాఖపట్నం రాజధాని అన్నప్పుడు తాను ధైర్యంగా నిలబడి అమరావతే రాష్ట్ర రాజధానిగా ఉండాలని గట్టిగా చెప్పినందుకు.. వైసీపీ నాయకులు తనను బండ బూతులు తిట్టారని...

నన్ను బండబూతులు తిట్టారు!

  • చంద్రబాబును అనరాని మాటలన్నారు

  • గన్‌ ఉంటే కాల్చేయాలనిపించింది: అచ్చెన్న

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం రాజధాని అన్నప్పుడు తాను ధైర్యంగా నిలబడి అమరావతే రాష్ట్ర రాజధానిగా ఉండాలని గట్టిగా చెప్పినందుకు.. వైసీపీ నాయకులు తనను బండ బూతులు తిట్టారని, తన పర్సనాలిటీ గురించి హేళనగా మాట్లాడారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం శాసనసభలో రాజధాని అమరావతికి చట్టబద్ధత తీర్మానాన్ని సమర్థిస్తూ ప్రసంగించిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి అంశాన్ని వివాదాస్పదంగా మార్చిన జగన్‌ ప్రజల మధ్య విభేదాలు, విఽధ్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన తమను(టీడీపీ ఎమ్మెల్యేలను) సస్పెండ్‌ చేశారని గుర్తుచేశారు. మండలిలోనూ మూడురాజధానుల బిల్లును ఆమోదించాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా అప్పటి మండలి చైర్మన్‌ షరీఫ్‌ తలొగ్గకుండా ఆ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించి ఈ రాష్ట్రాన్ని బతికించారని చెప్పారు. దీంతో ఆ రోజు శాసన మండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి, లైట్లు కూడా ఆపేశారని, ఆరోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని వ్యాఖ్యానించారు.


ఏం జరుగుతోందో చూద్దామని చంద్రబాబు సహా తామందరం శాసనమండలి గ్యాలరీల్లోకి వెళ్లగా, అక్కడున్న వైసీపీ నాయకులు చంద్రబాబును అనరాని మాటలన్నారని, అప్పుడు గన్‌ ఉంటే వారిని(వైసీపీ వాళ్లను) కాల్చేయాలనిపిచిందని తెలిపారు. ‘ఇలాంటి వెధవలు రాజకీయాల్లో ఉండాలా? ప్రజలు ఆలోచించాలి’ అంటూ అచ్చెన్నాయుడు ఉద్రేకానికి లోనయ్యారు. 2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈరోజు అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ తీర్మానం చేయాల్సిన అవసరమే ఉండేది కదన్నారు. ‘వైసీపీ దుర్మార్గులు’ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుందని చెప్పారు. ‘తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, లక్ష కోట్లు దోచుకుని, 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన దొంగకు 2019 ఎన్నికల్లో ఓట్లేసి రాష్ట్ర ప్రజలు పెద్ద తప్పు చేశారు.’ అని అచ్చెన్న పేర్కొన్నారు. కాగా, అచ్చెన్న ప్రసంగంలో రెండు అనకూడని పదాలు వాడారని, వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సభలో ప్రకటించారు.

Updated Date - Mar 29 , 2026 | 05:08 AM