Share News

ఫ్యాక్షన్‌ బాధితుడు కాదు.. హంతకుడు

ABN , Publish Date - May 23 , 2026 | 04:18 AM

మాజీ సీఎం జగన్‌ రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘‘వైసీపీది గొడ్డలి పార్టీ. సమాజానికి అది హానికరం.

ఫ్యాక్షన్‌ బాధితుడు కాదు.. హంతకుడు

  • జగన్‌పై మంత్రులు, నేతల ఫైర్‌

  • రాజారెడ్డి, వైఎస్‌, వివేకా మరణాలతో తొలి లబ్ధి జరిగింది జగన్‌కే

  • ఇలాంటి వ్యక్తి పుడతాడనే ‘అపరిచితుడు’ చిత్రం శంకర్‌ తీసినట్టు ఉంది

  • రాజారెడ్డి హత్యకేసులో ఆరోపణలున్న వ్యక్తి ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి

  • రంగా హత్యలో ఆరోపణలున్న వ్యక్తులంతా వైసీపీలో..

  • జగన్‌కు ఆ కేసు ప్రధాన నిందితుడి కుమారుడి స్వాగతం

  • ఇక జగన్‌ ప్రతి ఆరోపణకూ వడ్డీతో సహా బదులిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

‘‘జగన్‌ తాత రాజారెడ్డి హత్య కేసులో ఆరోపణలున్న వ్యక్తి ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. వైఎస్‌ మరణానికి రిలయన్స్‌ కారణమంటూ, ఆ సంస్థ ఆస్తులపై జగన్‌ నాడు దాడులు చేయించారు. ఆ తర్వాత రిలయన్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తికే రాజ్యసభ సీటు ఇచ్చారు. వంగవీటి రంగా హత్య కేసులో ఆరోపణలున్న వారి కుటుంబసభ్యులు జగన్‌ పార్టీలో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి కుమారుడే జగన్‌కు స్వాగతం పలుకుతారు, వీడ్కోలు పలుకుతుంటారు. జగన్‌ లాంటివాడు పుడతాడనే కావచ్చు, దర్శకుడు శంకర్‌ ‘అపరిచితుడు’ చిత్రం తీశారు.’’

- మంత్రి అచ్చెన్నాయుడు.

అమరావతి, మే22(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘‘వైసీపీది గొడ్డలి పార్టీ. సమాజానికి అది హానికరం. జగన్‌ది అపరిచితుడి క్యారెక్టర్‌. హత్యా రాజకీయాలకు అసలైన వారసుడు. ఆయన ఫ్యాక్షన్‌ బాధితుడు కాదు.. నిందితుడు. తెలుగు జాతికి పట్టిన రాజకీయ దరిద్రం’’ అంటూ అచ్చెన్న ధ్వజమెత్తారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని, వ్యవస్థలన్నింటినీ భ్రష్ఠు పట్టించారని మండిపడ్డారు. ఇప్పుడు 2-3నెలలకోసారి తాడేపల్లి ప్యాలెస్‌ వేదికగా అనుకూల మీడియాను పిలిపించుకుని అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహించారు. ‘‘చంద్రబాబుపై జగన్‌ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. 76ఏళ్ల వయస్సులో 26 ఏళ్ల కుర్రాడిలా పని చేస్తున్న చంద్రబాబు ఏపీని, దేశానికి రోల్‌మోడల్‌.


వంగోని కొబ్బరికాయ కొట్టలేని జగన్‌.. తన తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్‌, బాబాయి వివేకా మరణాలకు చంద్రబాబు కారణమంటూ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు.’’ అంటూ మంత్రి మండిపడ్డారు. జగన్‌ లాంటి వ్యక్తులు పుడతారనే దర్శకులు శంకర్‌ ’అపరిచితుడు’ చిత్రాన్ని తీశారేమోనంటూ వ్యాఖ్యానించారు. ‘‘రాజారెడ్డిని చంపినవారిని తానే మీ చేయలేదని జగన్‌ చెప్తున్నారు. జగన్‌ వ్యాఖ్యలపై ఆయన బాధితుడు పార్థసారథిరెడ్డి స్పందించారు. రాజారెడ్డి బాధితుల్లో మిగిలింది ఆయనే. ఆయన కూడా ఊతకర్రతో నడుస్తున్నారు.’’ అని అచ్చెన్న తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘జగన్‌కు హిందూ దేవుళ్లపై కక్ష ఎందుకో అర్థం కాదు. తిరుమల శ్రీవారివి ఏడు కొండలు కాదు...ఐదుకొండలే అని నాడు వైఎస్‌ అన్నారు. ఆ వ్యాఖ్యలను తప్పుపట్టిన చంద్రబాబు మాటలను జగన్‌ వక్రీకరించారు. తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తే మంచి జరగదని మాత్రమే చంద్రబాబు అన్నారు. ఆ మాటను పట్టుకుని వైఎస్‌ మరణానికి చంద్రబాబు కారణమంటూ జగన్‌ విషం చిమ్ముతున్నారు. వైఎ్‌సను చంపించింది ఆయన కుమారుడు జగనే అని నాడు బొత్స చెప్పారని నేను అంటే, బొత్స ఎందుకు ఏడ్చారో అర్థం కాలేదు. వైఎస్‌ మరణానికి రిలయన్స్‌ కారణమంటూ, ఆ సంస్థ ఆస్తులపై జగన్‌ దాడులు చేయించారు. ఆ తర్వాత రిలయన్స్‌తో సంబంధం ఉన్నవ్యక్తికే రాజ్యసభ సీటు ఇచ్చారు. వివేకాను ఎవరు చంపారు.. ఎవరు చంపించారో అందరికీ తెలుసు. జగన్‌ ప్రమేయంతోనే వివేకాను నరికి చంపారని అందరికీ తెలుసు. వివేకా మరణంపై మాకు చెప్పకపోయినా.. ఆయన కూతురు సునీతకు జగన్‌ సమాధానం చెప్పాలి. వివేకా కేసులో సాక్షులు ఎందుకు, ఎలా హతమయ్యారు? రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, వివేకా మరణాల్లో మొదటి లబ్ధిదారు జగన్‌రెడ్డే. కోడికత్తి, గులకరాయి డ్రామాలు అధికారం కోసం కాదా? జగన్‌ ఆరోపణలకు సరిగ్గా కౌంటర్‌ ఇవ్వక మేం చాలా నష్టపోయాం. ఇకపై జగన్‌ ప్రతి ఆరోపణకూ కౌంటరిస్తాం. ’’


వడ్డీతో సహా బదులిస్తాం

‘‘నోటీసు ఇవ్వకుండా ఆనాడు చంద్రబాబును అరెస్టు చేశారు. వైసీపీ గుర్తుపై గెలిచిన రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌ చేయించి, జైల్లోనే చంపాలని చూశారు. న్యాయమూర్తుల నుంచి, తన తల్లి, చెల్లి వరకు సోషల్‌ మీడియాలో దూషించారు. నాతో సహా బీసీ నేతల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. రాజధానిపై జగన్‌ నాటకాలు ఆడితే.. ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్దత తెచ్చారు. ఇప్పుడు మావిగన్‌ అంటూ జగన్‌ ప్రజల్ని ఇంకా మభ్యపెడుతున్నారు. జగన్‌ని పిచ్చోడనలా? సైకోఅనాలా? అమరావతిలో ఐకానిక్‌ భవనాల రేటు, పేదవాడి ఇంటి రేటు ఒకేలా ఉంటుందా? ఇది కూడా తెలియనట్లు మాట్లాడుతున్నారు. అమరావతిపై జగన్‌ విషం కక్కుతున్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి, ఫ్రస్టేషన్‌లో వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. ఇకపై జగన్‌ అబద్ధపు ఆరోపణలకు వడ్డీతో సహా బదులిస్తాం. జీతాలు ఇస్తే చాలని ఉద్యోగులతో దండాలు పెట్టించుకున్న జగన్‌కు ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది?’’ అంటూ తీవ్ర స్వరంతో అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Updated Date - May 23 , 2026 | 04:25 AM