వెన్నుపోటుపై పేటెంట్ జగన్‌దే
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:45 AM
వెన్నుపోటుకు కర్త, కర్మ, క్రియ జగన్ అని, వెన్నుపోటు అనే పదానికి గొడ్డలి పార్టీ నాయకుడు పేటెంట్ తీసుకున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
కులాల మధ్య చిచ్చుకు కుట్రలు: అచ్చెన్న
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): వెన్నుపోటుకు కర్త, కర్మ, క్రియ జగన్ అని, వెన్నుపోటు అనే పదానికి గొడ్డలి పార్టీ నాయకుడు పేటెంట్ తీసుకున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడని, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని పదవి కోసం కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచాడని, ఆస్తి కోసం తల్లి, చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. వెన్నుపోటు పేరుతో ర్యాలీలు నిర్వహిస్తున్న జగన్ ముందుగా తన రాజకీయ చరిత్రను చూసుకోవాలన్నారు. మద్యనిషేధం సహా అన్ని హామీలు విస్మరించిన జగన్‌కు, కూటమి మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు పారనివ్వకపోవడంతో కులాల మధ్య తగవులు పెట్టేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని, ఏదైనా సంఘటన జరిగితే.. దానికి కులం రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్మూధైర్యం ఉంటే డీఎస్సీలో అక్రమాలపై ఆధారాలతో చర్చకు రావాలని లోకేశ్ చేసిన సవాల్ స్వీకరించాలన్నారు. రొయ్యల ఫీడ్ కంపెనీలకు జగన్ కులం ఆపాదించడం సిగ్గుచేటన్నారు. అనితను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారనే విజ్ఞత మరిచి గొడ్డలి పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. అమర్నాథ్ వ్యాఖ్యలపై జగన్ రాష్ట్ర మహిళలకు, హోంమంత్రికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కులాల మధ్య చిచ్చు పెట్టడం జగన్ డీఎన్‌ఏలోనే ఉంది: సానా సతీశ్
కులాల మధ్య చిచ్చు పెట్టడమనేది జగన్ డీఎన్‌ఏలోనే ఉందని రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ ఓ ప్రకటనలో విమర్శించారు. తన రాజకీయ పబ్బం కోసం జగన్ కాపులను బలిపశువుల్ని చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. జగన్ కుల చిచ్చులో భాగంగానే గుడివాడ అమర్నాథ్ హోం మంత్రి అనితపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అనితకు గుడివాడ అమర్నాథ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అట్రాసిటీ కేసుకు ఆదేశించాం: జవహర్
దళితులను ఎవరు కించపరిచినా సహించేది లేదని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ స్పష్టం చేశారు. హోం మంత్రి అనిత దళితురాలనే విషయాన్ని విస్మరించి అమర్నాథ్ నీచంగా మాట్లాడటం సహించరాని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విశాఖ పోలీసు కమిషనర్‌ను ఎస్సీ కమిషన్ తరఫున ఆదేశించామని చెప్పారు.
బూతులు మానలేదు: గొట్టిపాటి
మహిళల పట్ల జగన్‌కు, గొడ్డలి పార్టీ నేతలకు ఉన్న గౌరవం ఏపాటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హోం మంత్రి అనితను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ బూతులతో కాలక్షేపం చేసిన గొడ్డలి పార్టీ నేతలు, అధికారాన్ని కోల్పోయినా బూతులు మాత్రం మానలేదన్నారు. మహిళా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.

దళిత మహిళా మంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలా?: సుభాశ్
హోంమంత్రి అనితపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఖండించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్న దళిత మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం అత్యంత దురదృష్టకరమన్నారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తిత్వ హననానికి దిగడం వైసీపీ సంస్కృతికి నిదర్శమని అన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడలేని వారు వ్యక్తిగత దూషణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.
